పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాగున్న దనుకున్నాడు. నిగనిగలాడే మోముతో, ఎర్రవారే బుగ్గలతో, పీచువలె రేగిన జుట్టుతో లోపలికి ప్రవేశించి తనకు బదులుగా వచ్చానని చెప్పినప్పుడు ఆపరేటరయిన టైలర్ తన అబ్బురపాటును దాచుకో లేకపోయాడు. కానీ అతడు యువకుడయిన కార్నెగీతో కలిసి కొన్ని వార్తలను ప్రసారం చేసినప్పుడు ఆతని శక్తినిగురించి తెలుసుకొన్నాడు. ఒక్క పిలుపునుకూడా విడిచిపెట్టకుండా అందుకోటంకోసం సాయంకాలం పొద్దుపోయినదాకా కార్యాలయంలో వుండి ఎంతో పనిచేద్దామని అతడు ఆదుర్దాగా వున్నాడు. ఒక తుఫాను రోజున సాయంత్రం తన తంతి యంత్రంమందు కూర్చున్నప్పుడు - ఏదో పుస్తకం చదువుతూనే, మెరసిన సమయంలో అతడు 'కీ'ని ముట్టుకోటానికి సాహసించాడు. ఏదో పెద్దభూతం పెనుగడతో తన్ను మోదినట్లు తోచింది. అతడు, అతడు కూర్చున్న బల్లా నేలమీద పడిపోవటం జరిగింది. నరాలు ఝల్లుమన్నవి. అప్పటినుంచీ ఈ ఉలికిపాటువల్ల పాఠంనేర్చుకొనడంచేత తుఫానువేళల్లో అతడు ఎంతో జాగరూకుడయి మెలగుతుండేవాడు.

గ్రీన్స్‌బర్గులో ఆండీ ప్రసిద్ధుడైనాడు. అతడు కేవలం చెవులతోటే వార్తలను గ్రహించే ప్రజ్ఞగలవాడని విని జనం అతణ్ని చూడటం కోసం కార్యాలయానికి వస్తుండేవారు. అతడు తాత్కాలికంగా తనకు ఒప్ప చెప్పిన పనులను ఎంతో సమర్థంగా నిర్వహించాడు. ఫిట్స్‌బర్గుకు తిరిగివచ్చిన తరువాత ఈష్టరస్ టెలిగ్రాఫిక్ కంపెనీ మేనేజరు చేసిన పనిని మెచ్చుకొంటున్నందుకు చిహ్నంగా అందమైన బైండుగల బరస్స్