పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/249

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మిష్టర్ కార్నెగి మీ రా పని చేయటాని వీలు లేదనుకుంటాను."

"వీల్లేదా"

"లేదు. 'కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్‌' అన్నది స్థిరమైపొయింది. దాన్ని మార్చటానికి వీలుండదు."

కార్నెగీ ఆ చెప్పినది నమ్మలేకపోయినాడు. "మీరు మిస్టర్ రూట్ ను విచారించవచ్చు. నేను చెప్పింది నిజమని నా నిశ్చయం. అయినా ఆయన్ను అడగండి తెలుస్తుంది.

కార్నెగీ మిస్టర్ రూట్‌ను పిలిపించాడు. అప్పుడు అతడు శాసనసభా సభ్యుడు. 'నిశ్చయంగా వీల్లేదు' అని ఆప్రముఖ న్యాయశాస్త్రవేత్త అన్నాడు. 'మీరు ఇప్పుడు కార్పొరేషన్ నుంచి థనాన్ని తీయటానికి వీల్లేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. మార్పుకు వీలుండదు."

ఇందుకు అతడు వెల వెల పోయాడు. ఏమయినా ఆతని బుద్ధి బ్రిటిష్ నిధిమీద లగ్నమై వుంది. తనకు మిగిలిన రెండుకోట్ల యాబైలక్షల డాలర్లు భార్యకు, కుమార్తెకు యిచ్చాడు.

మరి నిజానికి వాళ్ళకు అంత డబ్బుతో అవసరముందా? ఎంతో సేపు మదనపడి ఏర్పడ్డ పరిస్థితిని మిసెస్ కార్నెగీకి ఎరుకపరిచాడు."మీ బాండ్లలో నుంచి ఈ నిధి కోసం పదిమిలియన్లు నేను తీసుకోటం మీ కిష్టమేనా ?" అన్నాడు.