ఈ పుట ఆమోదించబడ్డది

617

నిశ్శంక కొమ్మన్న

అని శివలీలావిలాసములోను, వేమభూపాలుడు తమ్ముఁడైన వీరభద్రుని దయదలఁచి సింహాసనముపైనిఁ గూర్చుండఁ బెట్టినట్టు చెప్పఁబడినది. శివలీలావిలాసములోని యాశ్వాసాంత గద్య మిట్లున్నది:
 
     “ఇదీ శ్రీమదష్టభాషాకవితాప్రవీణ బుధజనస్తుత్య విశ్శంక కొమ్మనా మాత్య ప్రణీతంబయిన
      శివలీలావిలాసంబునందు"

శివలీలావిలాసము 1435 వ సంవత్సరప్రాంతమునందు రచియింపఁబడి యుండును. అందుచేత నిశ్శంక కొమ్మనామాత్యకవి 1430వ సంవత్సరము మొదలుకొని 1470వ సంవత్సరప్రాంతమువఱకును కవియై యుండి యుండును. ఈ కవిచేఁ రచియింపఁబడిన వీరమాహేశ్వరములోనివని యనేక పద్యము లాంధ్రపరిషత్పత్రికవారి యుదహరణ గ్రంధమునం దుదాహరింపఁబడి యున్నవి. ఈ శివలీలావిలాసమునకే వీరమాహేశ్వరమన్నది నామాంతరమో, యది వేఱు గ్రంథమో తెలియరాదు. గ్రంథము దొరకు వఱకును వీరమాహేశ్వరము ప్రత్యేక గ్రంథ మనియే భావింతము. కృతిపతి వంశజులు కొండవీటి రెడ్డివంశజులవలెనే దేసటివారు. ఇరువురును పంట కులమువారయి దాయాదు లయి యుందురు. శివలీలావిలాసములో వీరు దేసటివా రయినట్లీ పద్యములోఁ జెప్పఁబడినది :

      ఉ. అందు జనించి మించిరి సమగ్రనిరూఢి గ్రమక్రమంబునన్
          మందరధీరు లాగతసమస్త (విచా) రులు సంతత ప్రజా
          నందనకార్యకారులు గుణస్ఫుటహారులు ధర్మరక్షణా
          మందవిచారు లంగజితమారులు దేసటు లత్యుదారులై .

కొమ్మనామాత్యుని కవిత్వ మనర్గళధార కలదయి బుధజనమనోరంజకముగా నుండును. శైలి తెలియుటకయి యీతని గ్రంధములలోని పద్యముల గొన్నిటిని నిందుదాహరించుచున్నాను