ఈ పుట ఆమోదించబడ్డది

436

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

          శ్లో. కృతే యుగే బలి ర్దాతా
             త్రేతాయాం రఘనందనః,
             ద్వాపరే సూర్యపుత్రశ్చ
             కలౌ రాయనభాస్కరః.

ఇతఁడు 1516 వ సంవత్సరమునందుండినట్లు చెప్పఁబడిన రాయనిభాస్కరుని తాత యయి యుండును. ఈతని కాలమునందును దనకుఁ గొంత పూర్వమునందును నుండిన రావిపాటి తిప్పన్నకవిని సామాన్యక్షుద్రకావ్యకర్త యని జను లాతని కవిత్వమును తేలికగాఁ జూడగా నాతనిప్రేమాభిరామమును క్రీడాభిరామమను పేరఁ దెనిఁగించుచుండిన యభిమానముచేత వల్లభామాత్యకవి యాతనిని పూర్వకవులతో సమానుఁడుగాని సామాన్యుఁడు కాడని శ్లాఘించి యుండును. ఇట్లభిమానముచేతఁ చెప్పబడుటయే కాదు. తిప్పన కవిత్వము నిజముగానే శ్లాఘనీయముగా నున్నది.

    "ఆమంత్రి శేఖరుండు రావిపాటి త్రిపురాంతక దేవుండను కవీశ్వరుం డొనరించిన ప్రేమాభిరామనాటకమ్ము ననుసరించి క్రీడాభిరామంబను రూపకంబు తెనుంగు బాస రచియించినవాఁడు"

అని తిప్పనార్యుఁడు సంస్కృతమునఁ బ్రేమాభిరామనాటకమును రచించినట్టును దాని ననుసరించి వల్లభామాత్యకవి తెనుఁగున గ్రీడాభిరామమును రచించినట్టును క్రీడాభిరామప్రస్తావనలోఁ జెప్పబడినది. చిన్నతనములో తిప్పనకవియో యాతని తండ్రియో కడపటి ప్రతాపరుద్రుని యంత్యదశలో నోరుగంటిపురములో నుండుటచేత నాతని రాజధాని యైన యేకశిలానగరమును బ్రేమాభిరామములో రంగమునుగాఁ గవి చేకొని యుండును. కవికృతగ్రంథములలోనుండి కొన్ని పద్యముల నిందు బొందుపఱిచెదను.


1. త్రి పు రాం త కో దా హ ర ణ ము



            ఉ. శ్రీనగచక్రవర్తి తుదిశృంగము చూచెద నంచు నేటికిం
                బో ననిశంబు మానవుల పుట్టువుఁ జావును లేనిమందు నా
                చే ననుచుం బతాక యనుచేఁ దరుణాచల మెక్కి చీరుఁ బం
                చాననుఁ డిందుమౌళి త్రిపురాంతకదేవుఁడు భక్తలోకమున్