ఈ పుట ఆమోదించబడ్డది

273

బ ద్దె న క వి

          చ. "వనరుహనాభు కుద్దవుఁడు వజ్రికి జీవుఁడు వత్సధారుణీ
                శునకు యుగంధరుండు దితిసూతికి దైత్యగురుండు విక్రమా
                ర్కునకును భట్టి రీతి నధికుండగు నన్నయగంధవారణం
                బునకుఁ బ్రధానుఁడై నుతులఁబొందెను సిద్ధనమంత్రి యిద్ధరన్."

1156 వ సంవత్సరము మొదలుకొని 1163 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసిన వెలనాటి చోడుఁ డనఁబడెడు రాజేంద్రచోడునిచే నగ్రహరాదికమును బడసిన సూరనసోమయాజికి మనుమఁడగుటచే సిద్దన మంత్రి గా 1240-50 సంవత్సరప్రాంతములనుండి యుండవలెను. అప్పుడు సిద్ధనమంత్రి ప్రభువయిన నన్నయగంధవారణుcడును నించుమించుగా నా కాలమునందే యుండును. ఈ కాలము బద్దెనృపాలుని శాసనకాలముతో దాదాపుగా సరిపోవును. కాcబట్టి యీ నన్నయగంధవారణుఁడే బద్దెనృపతి యేమో ! అట్లయినచో బద్దెనకు నన్నయ యను నామాంతరము కూడఁ గలిగి యుండును. అప్పుడీతఁడు చోడుఁడు గనుక నన్నె (నన్నయ) చోడుఁడనియుఁ బిలువఁబడవచ్చును[1]

నీతిశాస్త్రముక్తావళిని రచించుటకుఁ బూర్వము కవి సుమతి శతకమును రచించినట్లీ క్రిందిపద్యమునఁ జెప్పకొనెను.

            క. 'శ్రీవిభుఁడ గర్వితారి
                క్ష్మావరదళనోపలబ్ధజయలక్ష్మిసం
                భావితుఁడ సుమతి శతకముఁ
                గావించినప్రోడఁ గావ్యకమలాసనుఁడన్."

పైనిఁ బేర్కొనఁబడిన బిరుదావళులు గాక యీ పద్యమువలనఁ గవికి కావ్యబ్రహ్మ యన్న బిరుదవిశేష మొకటి కనఁబడుచున్నది. ఈతనికిఁ బూర్వము నందుఁ బ్రతాపరుద్ర దేవుcడు సంస్కృతమున నీతిసారమును రచియించినట్లు చెప్పఁబడెనుగదా ! దానిని ప్రతాపరుద్ర దేవుఁడే తెలిఁగించెనో మఱియెవ్వరు

  1. [శ్రీ వీరేశలింగము పంతులు గారి యూహ సరికాదనియు, సిద్ధమంత్రి కుమారుఁడైన జన్నయమంత్రి క్రీ.శ.1406-1422 నడుమ కర్ణాట రాజ్యమును పరిపాలించిన దేవ రాజులయెద్ద నుద్యోగి గానుండినట్లు విక్రమార్క చరిత్రమునందే యుండుటంబట్టి తండ్రి, కుమారుల నడుమ 160 సంవత్సరముల యంతరముండదనియు 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ గలదు (మూఁడవ సంపుటము పుట 25)]