ఈ పుట ఆమోదించబడ్డది

268

కేతన

ణమును, దశకుమారచరిత్రమును మాత్రమేకాక విజ్ఞానేశ్వరీ యమను యాజ్ఞవల్క్యధర్మశాస్త్రమును గూడ తెనిఁగించెను [1]

అనేక లక్షణగ్రంధములు పుట్టి యున్న యీ కాలమునం దాంధ్రభాషాభూషణమంతగా నుపయుక్తము కాకపోవచ్చునుగాని యితర లక్షణగ్రంథములు లేని పూర్వకాలమునం దది పరమప్రయోజనకరముగా నుండినదనుటకు సందేహము లేదు. [2] కేతనకవిత్వము తిక్కనాదుల కవిత్వముతో సరిరాకపోయినను సలక్షణమయి మధుర మయినదిగానున్నది. ఈతని కవిత్వశైలి తేటపడుట కయి యీతని గ్రంథమునుండి కొన్ని పద్యము లుదహరింపఁబడుచున్నవి.

1. ఆంధ్రభాషాభూషణము.

       క. "భాషావేదులు నను విని
           యా షణ్ముఖపాణినులకు నగు నీడని సం
           తోషింప నాంధ్రభాషా
           భూషణ మను శబ్దశాస్త్రముం గావింతున్.


  1. ["కేతన తెనిఁగించినది యాజ్ఞవల్క్య స్మృతి యను ధర్మశాస్త్రము కాదు. ఆ స్మృతికి విజ్ఞానేశ్వరుఁడు రచించిన 'మితాక్షరి' అను వ్యాఖ్య ననుసరించినది. పేరికిది విజ్ఞానేశ్వరీయమే కాని దానికిది యనువాదము కాని, అనుసరణముకాని కాదు. మితాక్షరి విపులమగు గ్రంథము.కేతన పయి మితాక్షరిలోని విషయములను జనసామాన్యమున కుపయోగించు వానిని గూర్చి సంగ్రహముగ నొక చిన్న గ్రంథమును రచించి, దానికి 'విజ్ఞానేశ్వరీయమ'ని పేరు పెట్టి యుండవచ్చును. మూలమునందు వేర్వేఱు కాండములలో నున్న విషయము లిందు తార్మాఱయి యున్నవి]
  2. [ కేతన తనకుఁ బూర్వమున నున్నదియు, ద్వితీయ నాగవర్మచే 12 వ శతాబ్దికిఁ బూర్వము రచింపబడిన 'కర్ణాటక భాషాభూషణము' ననుసరించి 'ఆంధ్రభాషా భూషణము'ను రచించెననియు, ఆ నాగవర్మ తొలుత వేంగినగర నివాసియై యుండి, రాజకీయ కల్లోలములు కారణముగా కర్ణాటక దేశమున కేఁగెననియూ, ఆంధ్ర కర్ణా టక భాషాభూషణములు రెంటికిని చాల పోలికలు కలవనియు భాషా సాహిత్య విమ ర్శకులు, బహుభాషావేత్తలు నగు శ్రీ తిరుమల రామచంద్ర గారు వివరించి యుచున్నారు.]