ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటికూర్పు ఉపోద్ఘాతము

_______________

కవి చరిత్రములను వ్రాయఁబూను నావంటివారికి గ్రంథసామగ్రి తక్కువయగుటచేత కవులకాల నిర్ణయాదులను సరిగా వ్రాయుటకాని,అందఱి చరిత్రములను వ్రాయగలుగుట గాని, సాధ్యము కాదు. అయినను ముందు వారికి మార్గదర్శకముగా నుండు నన్నయపేక్షతో నాకు దొరకిన యల్పాధారములతోను పరిమిత గ్రంథ సాహయ్యము తోను నాశక్తి కొలఁది నేదో యొకరీతి చరిత్రము వ్రాయఁబూనినాను. ఇందు తప్పులు కుప్పలుగా నుండవచ్చును. విద్వాంసులగువారు నన్ను పరిహసింపక వాత్సల్యముతో నా లోపములను జూపి దిద్దించియు, నా యొద్దలేని గ్రంథములను నాకు బంపియు నాయుద్యమమును గొనసాగింతురని విశ్వసించుచున్నాను. "నేనిందు వ్రాసిన చరిత్ర సంగ్రహములో 1650 వ సంవత్సరమునకు బూర్వమునందుండిన కవులందరియొక్క చరిత్రమును జేర్చితినని చెప్పcజాలను గాని యిందుఁ బేర్కొనc బడిన కవులందఱును మాత్రమాకాలమునకుఁ బూర్వపువారేయని నిశ్చయముగాఁ జెప్పగలను. కృతికర్త యొక్కగాని, కృతిపతులయొక్కగాని కాలమును దెలిసికొనుట కాధారములు చిక్కకపోవుటచేతను, అప్పకవీయాది లక్షణ గ్రంథములలో నుదాహరింపబడి యుండకపోవుటచేతను, ఇప్పడు నాకు లభించియువ్న గ్రంథములలోనే కొన్ని యప్పకవి కాలమునకుఁ బూర్వమునందు రచింపఁబడినవియున్నను నేనని విడచిపెట్టియుండవచ్చును.

  • * * *

[1]

రాజమహేంద్రవరము
6వ నవంబరు 1894 వ సం.

కం. వీరేశలింగము


రెండవ కూర్పు



ఇందు మొదటి నూఱుపుటల గ్రంథమును ప్రథమ శాస్త్ర పరీక్షకు బఠనీయముగా నేర్పడియున్నందున, ఆ భాగమునందు మార్పులు చేయుటకు వలనుపడలేదు.

ఆ భాగములో జేర్చదలచుకొన్న యంశములలోఁ గొన్ని యీ పుస్తకాంతమున ననుబంధముగా జేర్పఁబడినవి, మొదటి కూర్పునందు విడువబడిన యనేక కవుల చరిత్రములిందుఁ గడపటిభాగమునఁ జేర్పcబడి యుండట,యీ కూర్పుయొక్క పుటల సంఖ్య వలననే తెలియవచ్చును. ఇందుగనcబడెడి లోపములను నాకు జూపుటకును, నాకు లభింపని గ్రంథములు తమయొద్దనున్నచో,బంపుటకును ఇందుండఁదగిన నూతనాంశములను దెలుపుటకును ఆంధ్ర భాషాభిమానులనెల్ల సవినయముగాఁ బ్రార్థించుచున్నాను,

రాజమహేంద్రవరము
5వ నవంబరు 1897 వ సం.

కం. వీరేశలింగము

  1. ఈ పీఠిక సమగ్రముగా మా కుపలబ్ధము కాలేదు