పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

భ్రమరాంబా మల్లిఖార్జునుడు దేవులకు దేవాలయమును గలిగి సుప్రసిద్ధబ్రాహ్మణ శైవపుణ్యక్షేత్రములలో నొక్కటియై చుట్టుప్రక్కల నన్నిశిఖరములకంటె ఎత్తైన శ్రీశైలమే మన యాత్రికునిచే బేర్కొనబడిన భ్రమరగిరియని నిశ్చయింపవచ్చును. ఈ శ్రీశైలము ద్వాదశ శివలింగ క్షేత్రములలో నొకటియై చుట్టుప్రక్కల నచ్చట యుఆన్ చ్వాంగ్ వర్ణనలకు సరిపోవుచు అంతస్తులవలె నుండు గుహలను, విహారములను సొరంగములను గలిగి నిర్జనారణ్యభూమియందు చొర నశక్యముగానున్నది కావున నీశ్రీశైలమఠమే పూర్వకాలమున నాగార్జునాచార్యుని నివాసస్థానమని నిర్ణయింపవచ్చును. ఇయ్యది యాంధ్రసామ్రాజ్య రాజధానియగు థాన్య కటకమునకు (ధరణికోట) పశ్చిమముగా 102 మైళ్ళ దూరమునను కర్నూలుకు 82 మైళ్ళదూరమునను మధ్య పరగణాల లోని మాణిక్య దుర్గమునకు దక్షిణముగా 250 మైళ్ళదూరమునను అనగా మన యాత్రికుని కోసల రాజధానికి బహుదూరముగను ఉన్నది. కావున నిక మన పురాతత్వ పరిశోధకులు శ్రీశైలమును తత్ప్రాంతపు గుహలను బరిశీలించి యేమైన శాసనాదులను వెతికి దీయగలిగినచో నాగార్జును డేకాలపు వాడో యాతని దానపతియగు శాతవాహనవంశజుడగు ఉదయన నామాంకితు డేకాలపువాడో నిస్సంసయముగ నిర్ణయింప గలుగుదుము. అట్టిది ప్రకృతమందు దుర్లభము.

కోసలదేశమునుండి మనయాత్రికుడు దక్షిణాభిముఖుడై