పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

అని బల్కెను. రాకుమారు డామాటలను విననట్లు, మౌనము దాల్చియుండెను. అంత నాగార్జునుడు నిర్మలచిత్తముతో ప్రాణత్యాగముచేయనుద్దేశించి, యొక యాయుధము కొఱకు అటు నిటు దిరిగి చూచి యేమియు గానక, తుదకొక శుష్కించినయొక తృణమును దీసికొని సునాయాసముగ శిరచ్ఛేదము గావించుకొని యుసురులు విడచెను.

"రాజ కుమారు డాఘోర కృత్యమును జూచి యతి సత్వరముగ నంత:పురమువైపు బరుగెత్తెను. ఇంతలో నాగార్జునుని విహారమున జరిగిన వృత్తాంతము నంతయు, నవలోకించిన ద్వారపాలకుడు సవిస్తరముగా రాజున కెరిగించెను. అత్తరి రాజును దు:ఖము నాపుకొనలేక వ్యాకులచిత్తుడై యుత్తర క్షణమందు ప్రాణములు విడచెను.

"కోసల దేశమునుండి నైరృతి దిక్కుగా 300 లీల (60 మైళ్ళు) దూరముననున్న (పోలోమోలో కీలీ) భ్రమరగిరి శిఖరమును జేరబోయితిమి. ఏకాంతప్రదేశమున నున్న యాపర్వతము, తక్కిన వానికంటె యున్నతముగ నుండి, నడుమ నడుమ కనుమలు లేక నొక్కటే ఱాయితో గూడుకొని మిక్కిలి యేటవాలుగనుండు గట్లు గలిగియున్నది. నాగార్జున బోధిసత్త్వుని కొఱకు సాద్వహ మహారాజు నీపర్వతమునందు, నడుమువరకు సొరంగమును త్రవ్వించి మార్గమును జేసెను. ఆసొరంగము చివర ననగా, కొండనడుమనొక, సంఘారామమును (బౌద్ధుల మఠము) నిర్మించెను.