పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

౨౮

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

భూమికలయందలి సుగతులను, మూడుకల్పము లందలి తధాగతులును పరమపురుషార్థమును బడయగోరి జీవయాత్రను ఈ లోకమున గడపుచు, నిర్వాణమును బొందిరి. వా రెల్లరు బుద్ధుని మార్గమును శ్రద్ధతో ననుసరించిరి. ఆతని ధర్మోపదేశములను గ్రహించి శాంతచిత్తముతో నాచరింపుచు వచ్చిరి. వారుధర్మరక్షణార్థము, తమ దేహములను వన్య మృగముల యాహారము కొరకు నర్పించిరి. పావురమును బ్రతికించుటకై ఒకడు తన దేహములను కోసి యిచ్చెను. పూర్వముచంద్రప్రభుడను రాజొక బ్రాహ్మణునికొరకు తన శిరమును కోసి యిచ్చెను. చేది రాజగు మైత్రిబాలు డొక యక్షుని యాకలిబాధ తీర్చుటకు తన రక్తముల ద్రావ నిచ్చెను. ఇంకను యిట్టివా రెందరో ప్రతి యుగమందున గలరు. వారందరును మహనీయులు. మన నాగార్జునుడు నట్టివాడే. ఆత డుత్కృష్ట ధర్మముల నవలంబించుచున్నాడు. అని చెప్పెను. కావున నో బోధిసత్త్వుడా! 'నాకై' తనప్రాణము నర్పింపగల మహనీయునికై యింత కాలము నుండి నేను అన్వేషించుచున్నాను; కాని యొక్కనిగూడ గాంచలేనైతిని. బలాత్కారముగ నెవ్వనినైన వధించినచో నా హత్యవలన సంభవించు మహాపాపము నన్ను చుట్ట కొనును. ఆ దుష్కార్యమువలన గలుగుదు:ఖ మపారము భరింప నలవికానిది. ఆజ్ఞానుడగు బాలుని వధించుటకున నా మనసు వప్పుకొనదు. అది నా కీర్తిని పాడుచేయును.