పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది

ఇమ్మడి దేవరాయల కాలమున, విదేశ వాణిజ్యము చక్కగా సాగుచుండెను. రాయలకు మూడువందల రేవులున్నవని రజాక్ వ్రాసినాడు. కాని అది అతిశయోక్తిగా గన్పట్టుచున్నది. ఆంధ్రదేశమున మోటు పల్లి మొదలుకొని తూర్పుతీరమున కన్యాకుమారి వరకును అచ్చటనుండి, పశ్చమతీరమున గోవ వఱకునుగల సముద్రపుటొడ్డు పట్టణములన్నియు రేవులేయని యెంచుకొన్నచో మున్నూరు రేవు లండుటలో నాశ్చర్యకరమైన దేమియు లేదు. విదేశ వాణిజ్యము విరివిగా సాగుటకై రాయల మంచి కట్టడులు చేసినట్లు గాన వచ్చుచున్నది. దేవరాయల కాలమున, రేవుపట్టణములకు అభయశాసనము వీయబడి, ఎగుమతి దిగుమతి సరకులపై సుంకములు, పూర్వ మర్యాదల ననుసరించి కట్టడలు చేయబడెను. ఆంధ్రదేశమున మోటుపల్లి రేవునందున్న దేవరాయల శాసనమందు, దిగుమతి, యెగుమతి సరకులపై సుంకాలు వివరింపబడి యున్నవి. ఇట్టి శాసనము లింకను ఇతర తావులం దెన్నిగలవో!

రాయలు, ఏనుగుల వేటయందు ఎక్కువ ప్రీతిగలవాడని అబ్దుర్‌రజాక్ చెప్పనమాటలు విశ్వసనీయములుగా గన్పట్టుచున్నవి. రాయలకు, తగినంత శాంతియుండిన గాని, ఏనుగులవేట యొకటి యాచారము చేసుకొనుటకవకాశ ముండదుగదా! అతడు ఏనుగుల వేటాడుట మొదట నెలకొల్పిన కారణమున గాబోలు తన నాణెములపై రాయ గజగండ భేరుండయనియు, గజబేటకారయనియు, బిరుదులు వ్రాయుంచు