పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/205

ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పను. ఎట్లో అల్లా నాయందు కరుణాళుడై యుండినందున ప్రయాణము సాగించితిని. షాబాను మాసమున [1]పండ్రెండవ దినమున నేను విజయనగరమునుండి యితర రాయబారులతో పాటు బయలుదేరితిని. పదునెనిమిదిదినము లహోరాత్రములు పయనము గావించి 'రమ్‌జాను'[2] మొదటిరోజున మంగుళూరునగరమున జేరితిని. మంగళూరులో రమ్‌జాను ఉపవాస దినములను జరిపి, పిమ్మట హానూరు రేవునకు బయలుదేరితిమి. మంగళూరులో సయ్యదు అల్లాఉద్దీన్ మషాడి అను మహమ్మయఫకీరు గలడు. అతనికి నూటయిరువది సంవత్సరములు వయస్సుండునని చెప్పుదురు. హిందువులను, ముసల్మానులునుగూడ నాతని మహనీయునిగా భావించి పూజింతురు, అట్టి మహనీయుని సందర్శించి, మాశీర్వాదము బడయుభాగ్యము నాకు లభించునందుల కే నెంతయు నదృష్టవంతుడనని యెంచెదను. ఇచ్చట నుండగనే విజయనగర రాయబారులలో ప్రధానుడగు ఖ్వాజామసూద్ ఆకస్మాత్తుగ మరణించెను.

"హానూరు రేవునందు పారశీకదేశమునకు బోవుటకై యోడ నొకదానిని గుదుర్చుకుని నలుబదిదినముల ప్రయాణమునకు వలసిన సామగ్రినంతయు సమకూర్చితిని. ఇచ్చట

  1. షాబానుమాసము మనకు పుణ్యమాసమగును.
  2. రమ్‌జాన్ మొదటిరోజు మాఘ శు 2 యో ప్రధమతిధియో యగును.