పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

జులు, భీమరాజును ఆమెకు సామంతులుగా శా. శ. 1187 (క్రీ. శ. 1265) వఱకును బరిపాలించి యుండినట్లు దెలుపు వారి శాసనములు గానవచ్చుచున్నవి. వారి గణపాంబయే రాజ్యపాలనము చేసియుండిన ట్లూహింపవలయును. మార్కోపోలో మోటుపల్లిరేవును జూడవచ్చిన దించుమించుగా క్రీ. శ. 1290 వ సంవత్సరమని యీవఱకే తెలిపియుంటిమి కావున నీతడు మోటుపల్లియందు, గణపాంబా మహాదేవియొక్క నలువదియ పరిపాలన సంవత్సరమున నుండినట్లు స్పష్టమగుచున్నది. ఇందుల కాతడు "ఈమె తనభర్త చనిపోయినదిగా నలువదిసంవత్సరములనుండి, యాయన రాజ్యమును, ధర్మబుద్ధితో న్యాయపరిశీలనతో విశేషమగు ప్రజ్ఞతో పరిపాలన చేయుచున్నదని వ్రాసినపంక్తులు యదార్థములగు చున్నవి. మార్కోపోలో ప్రశంసజేసినరాణి, గణపాంబామహాదేవియనుట కింకొక ప్రమాణము కూడగలదు. ఆమెయేలిన రాజ్యమామెభర్తదిగాని, తండ్రిదిగాదు. గణపతిదేవచక్రవర్తి, పుత్రికాసంతానమేగాని పుత్రసంతానము లేనివాడై, కుమార్తెయగు రుద్రాంబికను కుమారునిగా భావించి, విద్యాబుద్ధులు చెప్పించి, రాజనీతి యుపదేశించి, తాను జీవించియుండగనే కాల మాసన్నమైనదని గ్రహించి, మంత్రిపురోహిత సేనాపతులను సామంతులను రావించి, యామెను పట్టాభిషిక్తురాలింజేసెను. ఆమె యప్పటికే వైధవ్యము ననుభవించుచుండెను. ఆమె గణపాంబిక వలెగాక చిన్ననాటనే భర్త వియోగముకలిగి నాటనుండియు, తండ్రిచే