పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/125

ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱువేలనాడని వ్యవహరింపబడుచున్నది. కృష్ణానదికి దక్షిణమునగల భాగము, అనగా నిప్పటి సత్తెనపల్లి, గుంటూరు తాలూకాలును, బాపట్లతాలూకాలోని కొంత సీమయు గలిసి, క్రీ.శ. 10, 11, 12 శతాబ్దముల నుండియు నాఱువేలనాడని బరుగుచుండెను. కావున, మోటుపల్లియు నాఱువేలనాటిలోనిది గావలయును. మార్కోపోలో యోడ దిగిన రేవును, ఆతడు కథలుగావిన్న వజ్రపుగను లుండిన పరిటాల గ్రామమును, ఆఱువేలనాటి లోనివిగా నున్నవి. ఈ యాఱువేలనాటి రాజ్యమునకు రాజధాని, కృష్ణానదిమీద నున్న ధాన్యవాటీపురమని బిలువబడు చుండు అమరావతీ నగరము. ఇయ్యది క్రీస్తుశకారంభ కాలమునకు బూర్వము, వెనుకను, నన్నూఱేండ్లుబాలించిన ఆంధ్రరాజులగు శాతవాహనులకు రాజధానియై యుండెను. మరియు పూర్వమొకప్పుడు సుప్రసిద్ధబౌద్ధక్షేత్రమై యుండెను. ఇచ్చట నొకప్పుడు మిక్కిలి సుందరతరమైన స్తూపమును ఎత్తైన చైత్యము నుండినట్లు చిహ్నములు గాన్పించుచున్నవి.

మనకథానాయకుని కాలమునాటికి ఆఱువేల నాటిని కోటవంశపు చతుర్థకులజులు పరిపాలించుచుండిరి. కాంచీపుర చోళరాజులకు నామ మాత్రముగ సామంతులయి, కాంచీపురము మొదలుకొని సింహాచలము పర్యంతము గల యాంధ్రదేశభాగమును బరిపాలించు చుండిన వెలనాటి వంశజులకు, కోటరాజులు తొలుత నుండియు నా జన్మశత్రువులయి యుండి