పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/121

ఈ పుట ఆమోదించబడ్డది

తులు మేలయినవాటిని తామే ఉపయోగించు కొందురు.

"ఈదేశమున నూలుబట్టలు, అత్యుద్భుతము లయినవి నేయుదురు. అవి సాలె పట్టువలె బహుసున్నితముగా నుండును. ఎంత వెలయిచ్చిన నంతకు సరిపోవునట్టి రకపు సెల్లాలిచ్చట లభించును. వాటిని చూచినపు డేదేశము నందైనను ఏరాజును ఏరాణియు వాటినిధరింప నిచ్చగొనకుండ జాలరు? ఇచ్చట జనులకు గొఱియలమందలు లెక్కకు మీఱియున్నవి. మరియు, వారికి గావలసిన వన్నియు, గావలసిన వానికంటె నత్యధికములుగ లభించుచున్నవి.*

మార్కోపోలో ఆంధ్రదేశములోని తానుజూచిన మండలమును ముటఫిలి రాజ్యమని పేర్కొనియున్నాడు. ముటఫిలి అనురేవుపట్టణ మీకాలమున మనకు దేశపటములందు ప్రసిద్ధ పట్టణముగా గాన్పించుటలేదు. రేవుపట్టణముగా కూడగాన్పింపదు. ముటఫలిరేవును, మార్కొపోలోమోసల్ అనిగూడ బిలిచియున్నాడు. మోసల రేవు మచిలీపట్టణమని, చరిత్రకారులు నిర్ణయించిరికాని యానిరూపణము యదార్థమైనదికాదు. ముటఫిలియనుపేరు యాప్రాంతముననున్న మోటుపల్లికి సరిపోవుచుండుట చేతను, అచ్చట వీరభద్రేశ్వరుని యాలయమున బ్రతిష్టింపబడిన గణపతిదేవుని శాసనమునం దాయూరు గొప్పరేవు పట్టణమై యుండినట్లు వక్కాణింపబడియుండుట చేతను, మార్కొపోలో సందర్శించినది మోటుపల్లి రేవనియే నిశ్చయింప వలయును. మరియు, మోటుపల్లి, కాకతీయులకు