పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

మార్కొపొలో రచించిన గ్రంథము నాలుగు ఖండములుగ విభజింపబడియున్నది. మార్కో చెప్పుచుండగా వ్రాసిన లేఖరి రుస్టీకియునో యా గ్రంథమున కొక పీఠికను వ్రాసియున్నాడు. అందాతడు, మార్కొపోలో జనకులు ఇల్లు వెడలిన దాదిగా, చీనా దేశమునుండి తిరిగివచ్చి, మన కథానాయకుని వెంటబెట్టుకొని మరల ప్రయాణ మగువఱకు జరిగిన వృత్తాంతమును, పోలో కుటుంబ చారిత్రమును సంగ్రహముగా జెప్పినాడు. మార్కొపోలో తన గ్రంథమునందు ప్రధమ ఖండమున, దూర్పు ఆర్మినియాదేశము మొదలుకొని కుబ్లయిఖానుని రాజధానిని జేరువఱకు చూచినదానినంతయు వర్ణించినాడు. మరియు నందే ఖానునిరాజ్యము, పరిపాలనము, ప్రజలు, రాజధాని మున్నగువాటిని గూర్చి వివరించి, శేషించిన దానిని ద్వితీయ ఖండమున బ్రథమ భాగమున వర్ణించినాడు. ద్వితీయ భాగమున నీతడు చీనాదేశమందు సలిపిన యాత్రలు, ఆయా దేశములందు తాను చూచిన విశేషములను సంగ్రహముగా వ్రాసినాడు. తృతీయ భాగమున కుబ్లయిఖానుని సామ్రాజ్యములో బూర్వదిశయందున్న రాజ్యములను గూర్చి తెలిపినాడు. తృతీయ ఖండమున జపానుదీవులు, హిందూమహా సముద్రము, అందలి ద్వీపములు, సింహళము, దక్షిణ హిందూస్థానము, పారసీక దేశమువఱకు గల రేవులను మున్నగువాటిని వర్ణించినాడు. చతుర్థఖండమున పారసీకదేశము తార్తార రాజ్యము మొదలగు యుత్తర దేశములనుగూర్చి