పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/112

ఈ పుట ఆమోదించబడ్డది

ఇంటికివచ్చిన తరువాత మార్కొపోలో నలువదియేడవయేట పెండ్లియాడెను. మార్కో చెఱసాలలో నున్నపుడు, మరల నాతడు చెఱవిముక్తుడై యింటికి రాజాలడనియు తనభాగ్యమంతయు, పరుల పాలగునని భయపడి నికోలో ముదిమిని మరల పెండ్లియాడెను. ఆపెండ్లివలన నికోలోకు మువ్వురు కుమారు లుదయించిరి. కాని వీరిమువ్వురును వెనీషియను ధర్మశాస్త్రానుసారము ఔరసపుత్రులుగా బరిగణింపబడజాలరు. మార్కొపోలో చెఱనుండివిముక్తుడై వచ్చినతరువాత, కౌమారమున డొనటా అనునామెను పెండ్లియాడెను. ఆమెవలన నతనికి మువ్వురు స్త్రీసంతానమేగాని పురుషసంతతి కలుగలేదు. తాను వృద్ధు డగుచున్నాడని దెలుసుకొనిన పిమ్మట నాతడు క్రీ.శ. 1324 సంవత్సరమున జనవరినెల 9 వ తేదిని ఒక మరణశాసనము వ్రాయించి, తన తదనంతరము, తనయాస్తికి కూతుళ్ళను, కర్తలుచేసి, భార్యను యజమానిగా నియమించెను. ఈమరణ శాసనమును వ్రాయించిన తరువాత నీతడెంతకాలమో జీవింపలేదు. వెనీషియానగరమున మార్కొపోలో వ్రాసిన మరణశాసనము మూల ప్రతి మ్యూజియమునం దుంచబడియున్నది! ఆతడు నివాసముండిన సౌధముకూడ నేడు యాత్రికులకు మహద్వస్తువు క్రింద జూపబడుచున్నది. ఈ కాలమున వినీషియనులే కాదు యిటాలియా వాస్తవ్యులందఱును మార్కొపోలోను, గర్వముతో నంస్మరించుచున్నారు.