పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది

కూలుడుకాలేదు. ఆతడింకను సుఖముగా జీవయాత్ర గడుపుటకు నోచుకొనియుండలేదు. క్రీ.శ. 1296 వ సంవత్సరమున వెనీషియాకును, జినోవాపట్టణమునకు యుద్ధము సంభవించెను. ఆయుద్ధముననె మార్కోపోలో సొంతద్రవ్యము వెచ్చించి యోడనుకట్టించి బయలుదేరెను. కాని యుద్ధమునందు వెనీషియనులు, పరాజితులయిరి. మార్కో, పట్టువడి తుదకు ఖైదిగా, జెనీవాకు గొంపోవబడెను. ఆనగరమున, నాతని బ్రఖ్యాతి విన్న వారందఱును ఆతనిసందర్శించి, సంభాషింప నేతెంచుచుండిరి. ఆతనిగూర్చి యత్యాశ్చర్యకరములయిన వృత్తాంతములు నల్దిశల వ్యాపించెను. కాని చెఱవిముక్తికాదయ్యెను. కోటీశ్వరుడగు తండ్రి యితని నెట్లయిన లంచమిచ్చి విముక్తుని చేయ విశ్వప్రయత్నములు గావించెను, గాని నిష్ఫలములయ్యెను. చెఱసాలలో నున్నప్పుడెందరో, యాతడుకని, విన్నవృత్తాంతములను చెప్పగోరుచు, వేధించుచుండిరి. దానికాతడు సహింపజాలక, తోడిఖైది, "రుస్టీకియానో" యనునాతనికి, తనకువచ్చియురాని లాటిన్ బాషలో గ్రంథమును చెప్పి వ్రాయించెను. ఆప్రతినిచూచి, యిటలీలో ననేకప్రాంతములవారు ప్రతులను వ్రాసికొనిపోయి, ఆతురతో, వినోదార్థము చదువుకొనుచుండెడివారు. ఇంతలోనాతని పాండిత్యమును, కులీనతయు మర్యాదయు, కీర్తియుదశదిశల వ్యాపించుటచేత జినోవాప్రభుత్వము వారాతనిని గౌరవముగా చెఱసాలనుండి విముక్తుని జేసిరి.