ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాఱవ ప్రకరణము


ఆస్త్రీకి ముప్ప దేడు వత్సరముల వయస్సు, అయినను, చూచెడువారికి నిమాయికన్న నెక్కుడు వయస్సు గలదని బోధపడ లేదు. మాసిన జీర్ణ వస్త్రమును ధరించుకొని యా గృహంబునఁ బ్రవేశించిన వెంటనే యింటియందు మెఱుపు చందంబున ప్రకాశించెను. చెట్లయందు తలిరాకులచేఁ గప్పం బడిన పూవులగుత్తు లాకస్మికముగా వికసించిన ట్లయ్యెను, ఎచ టనో యత్తరుబుడ్డి మూఁత దెఱచి యుంచినట్లు ఘుమఘుమ వాసన వీచెను. పొగ లేక నిగనిగలాడు నిప్పున దశాంగ చూర్ణము చల్లిన ట్లయ్యెను, ఇటులుండ నా సుందరవతి గృహంబునఁ బ్రవేశించి యచ్చటచ్చటఁ దన విభుని వెదకెను. ఎచ్చోటను కనఁబడఁడయ్యెను. ఇఁకను గొన్ని ప్రదేశములయం దరసి చూడఁగా నొకచోట గున్న మావి కొమ్మపై శిరము నుంచికొని జీవానందుఁ డేడ్చుచుండెను. ఆ సుందరీమణి యల్లనల్లన నతని సమీపంబునకుఁ బోయి యాతని కరంబును బట్టుకొనియెను. జగదీశ్వరుఁడే యెఱుఁగుఁగాక, ఆయమ నేత్రంబుల యం దశ్రు ధారలు వర్షంబు నతిక్రమించిన ట్లుండెను. ఆ నేత్ర జలంబులు అడ్డగింపఁబడక ప్రవహించి యుండినచో నందు జీవానందుఁడును తేలిపోయి యుండును. ఆమె యించుక ధైర్యశాలిని కాఁబట్టి యాజలంబులను నిరోధించుచుండెను. పిదప, జీవానందుని చేయిఁబట్టుకొని, 'అయ్యో! యిదే మన్యాయము!