ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము

81


నిమి, బిడ్డను ఒడిలో కూర్చుండఁ బెట్టుకొని పాలు త్రాగించుచుండగా, దాని కన్నులనుండి కన్నీ రొలికేను. దానికొక బిడ్డ యుండెను. అది చచ్చిపోయెను. ఈబిడ్డ తన బిడ్డవలెనే యుండెను, వెంటనే నిమి కన్నీరు తుడిచికొని, నవ్వుచు జీవానందునిం జూచి 'అన్నా ! ఈబిడ్డ యెవరిదన్నా !' యని యడిగెను.

జీవానంద—— నీకేమి?

నిమి—— ఈబిడ్డను నా కిప్పించెదవా ?

జీవా—— నీవు బిడ్డను తీసికొని యేమి చేయుదువు !

నిమి—— నేను బిడ్డకు పాలు పోసి సాఁకుకొనెద. పెద్దదానిని జేసెద. అని చెప్పుచుండఁగా, మరల కన్నుల నీరు స్రవించెను. నిమి చేతితోఁ దుడిచికొని మరల నవ్వెను.

జీవా——నీకేల, నీకింక నెందఱో బిడ్డలు పుట్ట నున్నారు.

నిమి——అయిన నేమి ? ఈబిడ్డను నాకిమ్ము, లేదా తీసికొనిపో.

జీవా—— తీసికొనిపోయిన చచ్చిపోవును. నే నప్పుడప్పుడు వచ్చి చూచుకొనుచుండెద. ఇది కాయిత బాపనపిల్ల, నేను పోయెదను.

నిమి——అదేమన్నా ! భోజనము చేయలే దేమి? ఇంత సేపై నది; కొంచెము భోజనము చేసిపో, నాయాన, ఊరక పో రాదు.

జీవా——కొంచెమేమి, నాయిష్టమువచ్చినంత భోజనము చేసెద. నీవు ఒట్టు బెట్టినందున నిలువ వలసి వచ్చినది. ఏదో ఉన్న దానిని ఉంచుము, అనెను,