ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలవ ప్రకరణము

మహేంద్రుఁడు కారాగారవిముక్తుఁ డగుట.

రాత్రి యైనది, కారాగారబద్ధుండైన బ్రహ్మచారి మహేంద్రునిం జూచి, “ నేఁడు ఆనందమైనదినముగా నున్నది. ఏలన, మనము కారాగారమునందు బద్ధులమై యున్నారము; 'హరే మురారే' యని చెప్పు మనెను. మహేంద్రుఁడు దీనస్వరముతో 'హరే మురారే' యని చెప్పెను.

సత్యానంద—— దైన్య మేల? నీవు ఈ వ్రతమును గ్రహణము చేసితి వేని, భార్యను బిడ్డను అవశ్యము త్యజింపవలయును. వారికిని నీకును ఏసంబంధము నుండఁగూడదు.

మహేంద్ర——త్యజించుట యనునది యమదండస్వరూపముగా నున్నది. ఏబలముచే నే నీ వ్రతమును గ్రహింపవలయునో, ఆ మహాబలము నా భార్యతోను బిడ్డతోను పోయినది.

సత్యా——శక్తి వచ్చును నేను శక్తి నిచ్చెదను. మహా మంత్రమునందు దీక్షితుఁడవు కమ్ము. మహా వ్రతమును గ్రహింపుము.

మహేంద్రుఁడు విరక్తుఁదై——నేను పెండ్లమును బిడ్డను కుక్కల నక్కలపాలు చేసితిని. నాకు ఏవ్రతమును అక్కఱ లేదు.

సత్యా—— ఆవిచారమును మానుము. సంతానులు నీభార్యను సత్కారము చేసినారు. నీబిడ్డను పిలిచికొని పోయి కాపాడుచున్నారు.