ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

65


కల్యాణి బలాత్కారముచేత నాగుళికను తీసి విసరి పాఱవేసెను. బిడ్డ ఏడ్చుటకుఁ దొడంగెను.

వెంటనే కల్యాణీ నదికిఁబోయి గుడ్డను తడిపి తెచ్చి బిడ్డ నోటిని తుడిచి, మిగుల చింతతో మగనిం జూచి, 'కడుపులోనికిఁ బోయి యుండునేమో' యనెను.

తల్లి దండ్రులకుఁ జెడుపే తోఁచుట స్వాభావికము. ఎచ్చట ప్రీతి విశ్వాసము లధికమో యచ్చోటనే భయముగ నుండును. మహేంద్రుఁడు మొదట గుళికను జూచిన వాఁడు కాఁడు కనుక, 'నేలపైఁ బడియున్న గుళిక నెత్తి చూచి 'కొంతవఱకు పోయి యుండు' ననెను.

కల్యాణికిని ఆప్రకారమే తోఁచెను.

ఇంతలో బిడ్డకు విక్రుతావస్థకల్గెను. ఆటునిటు పొర్లెను, వికారస్వరముతో నేడ్చెను. కనుల గ్రుడ్లు పైకి వచ్చెను. చోంగ కారుచుండెను, నాలుక వ్రేలాడుచుండెను. తుదకు నిశ్చేష్టిత యయ్యెను.

అంత కల్యాణి, 'ఇఁక నేమియున్నది, ముగిసెను. ఈశ్వరుఁడేమార్గముగా రావలసినదని నియమించి యుండెనో యామార్గముగా సుకుమారి పోయెను. నేనును అదేమార్గము నంటి పోఁదలఁచెదను.'

ఇట్లు చెప్పి కల్యాణి విషగుళికను నోటిలో వేసికొని మ్రింగి వేసెను. మహేంద్రుడు ఏడ్చుచు 'ఏమి చేసితివి కల్యాణీ!' యనెను.