ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదియైదవప్రకరణము

233


మైన రాత్రి కాలమున విష్ణుమండపమునం గూర్చుండి ధ్యానము చేయుచుండెను. ఆసమయమందు చికిత్సకుఁ డచ్చటికి వచ్చి దర్శన మొసంగెను. అతనింగాంచి సత్యానందుడు ప్రణామము లాచరించెను

చికిత్సక — సత్యానందా! నేడు మాఘపూర్ణిమ.

సత్యానంద——దయచేయుఁడు; నేను సిద్ధముగా నున్నాఁడను, అయినను “ఓమహత్మా! నాకొక సందేహ మున్నది, దానిని నివర్తి చేయవలయును, నేనేముహూర్తమున యుద్ధము నందు జయ మొంది యార్యధర్మమును నిష్కంటకముగా నొనర్చితినో, యాముహూర్తమునందే యీ కార్యమునందు ప్రవర్తింపవల దనెడియాజ్ఞ యేల?"

చికిత్సక—— నీ కార్యము సిద్ధ మాయెను. ముసల్తానుల రాజ్యము ధ్వంస మాయెను. ఇఁక నిచ్చట నీ కేపనియు లేదు, నిష్ప్రయోజనముగాఁ బ్రాణహత్య చేఁ బ్రయోజనము లేదు.

సత్యానంద—— ముసల్తానుల రాజ్యము ధ్వంసమాయెను. అయినను హిందూ రాజ్యము స్థాపితము కాలేదు. ఇప్పటికిని కలకత్తాలో నాంగ్లేయులు ప్రబలులై యున్నారుకదా ?

చికిత్సక—— హిందూ రాజ్య మిప్పుడు స్థాపితము కాదు. ఇప్పుడు నీవుండినచో నిష్ప్రయోజనముగా నరహత్యలు సంభవించును కావున వెడలుము.

ఈమాటను విని సత్యానందుఁ డత్యంత చింతాక్రాంతుడై “ఓ ప్రభూ! హిందూ రాజ్యము స్థాపితము కాకుండిన నెవ్వరు రాజు లగుదురు? మరల తురకలే రాజు లగుదురా?" అనెను.

చికిత్సక——లేదు. ఇప్పు డాంగ్లేయులు రాజు లగుదురు,