ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

ఆనందమఠము


శాంతి అనాయాసముగా జీవానందుని చంకయందిడుకొని కొలనియొద్దకుఁ దీసికొని పోయెను. ఆవైద్యుఁడు “నీవు శరీర మందలి రక్తమును గడుగుచుండుము, నేను ఔషధములను దెచ్చెదను" అని చెప్పి వెడలిపోయెను. శాంతి వైద్యుఁడు చెప్పిన మేరకు రక్తము నంతయుఁ గడుగుచుండెను.

శాంతి, కడుగుచుండఁగనే వైద్యుఁడు అడవియాకులను తీఁగెలను దెచ్చి రసముదీసి గాయములకుఁ బూసి దేహమును తన చేతితోఁ దడవెను, జీవానందుఁడు దీర్ఘ శ్వాసము విడిచి లేచి కూర్చుండి, శాంతినిఁ జూచి "యుద్ధమున నెవరు జయించిరి?” అని యడిగెను.

శాంతి, “నీకే జయ మాయెను. ఈ మహాపురుషునకు సాష్టాంగ దండ ప్రణామంబు లాచరింపు" మనియెను.

ఆప్పు డాయిరువురును చూడఁగా నెవ్వరు నుండ లేదు! ఎవరికి నమస్కరించుట?

సమీపమునందే జయశాలురైన సంతానుల కోలాహల మగుచుండెను. అయినను, శాంతిగాని జీవానందుఁడుగాని లేచి పోలేదు. ఆ పూర్ణచంద్ర కిరణోజ్జ్వలమై ప్రకాశించు పుష్కరిణి సోపానములపైఁ గూర్చుండి యుండిరి. జీవానందుని శరీరము ఔషధ మహిమచేఁ గొంచెము సేపులోనే స్వస్థ మయ్యెను. అతఁడు “శాంతీ! చికిత్సకుని యౌషధము ఆశ్చర్యకరమైనది! నా శరీరమునం దేవేదనమును లేదు. ఇపు డెచ్చటికి పోవలయునో నడువుము. అదిగో అచ్చట సంతానుల జయసూచక మైన యుత్సవము జరుగుచున్నది” యనెను.