ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది యొకటవ ప్రకరణము

211


మాఘశుద్ధ పూర్ణిమ సమీపించెను. ఆనాఁడు వానిశిబిరంబునకు సమీపమున నుండు కేందుబిల్ల మనుగ్రామమున గోసాయీల పరిషత్తు జరుగుట కలదు. కాఁబట్టి ఈతూరి ఆపరిషత్తు కోలాహలముగా జరుప నిశ్చయించిరి. అక్కడ సామాన్యముగా ప్రతిసంవత్సరము నొకలక్ష ప్రజ చేరును. ఈ వత్సరము వైష్ణవుల రాజ్యాధికార మైనందున వైష్ణవులు పరిషత్తును బహు సంభ్రమముగా జరుపవలయు నని యెంచి యుండిరిగాన, సంతాను లందఱును కేందుబిల్ల గ్రామంబునకు వచ్చి చేరుదు రని తలంచుట కవకాశము కలిగినది. మేజరు ఎడ్వర్ డ్సు దొర, పదచిహ్నగ్రామంబున నుండు ధనాగారరక్షకులుకూడ పరిషత్తుకు రాఁగలరు గాన, నాసమయంబునఁ బోయి పదచిహ్నదుర్గమును స్వాధీనము చేసికొనవలయు నని యాలోచించి యుండెను.

ఎడ్వర్ డ్సు ఈయభిప్రాయమును మనసునం దుంచికొని బాహ్యముగా పరిషత్తునాఁడు కేందుబిల్ల గ్రామంబు నాక్రమించు కొనఁబడుననియు, ఆదినమే శత్రువులు అందఱును నిశ్శేషముగా జంపఁ బడుదు రనియు, కనుక వైష్ణవుల పరిషత్తును జరు పఁగూడ దనియుఁ బ్రచురించెను.

ఈసమాచారము ప్రతి గ్రామంబునను బ్రచురింపఁబడియెను. ఇందువలన నచ్చ టచ్చట నున్న సంప్రదాయస్థులందఱును ఆయుధపాణులై కేందుబిల్ల గ్రామమున కేఁగి పరిషత్తు జరుపఁదలంచి పోయి చేరిరి. సకల సంతానులును మాఘశుద్ధ పూర్ణిమదినమున కేందుబిల్ల గ్రామము: జేరిరి. ఎడ్వర్ డ్సు దోర తలంచినట్లే యాయెను. ఆంగ్లేయుల యదృష్టమునకు సరిగా మహేంద్రుఁడును ఈ మోసకృత్యమునకు లోఁబడియెను.