ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

ఆనందమఠము


భూమిపై సాష్టాంగ నమస్కారము చేసి మనంబున జగదీశ్వరుని ధ్యానింప నారంభించెను. రాత్రి ప్రభాతమగుచు వచ్చెను. అపు డెవరోవచ్చి యతని మస్తకమును స్పృశించి "నేను వచ్చి యున్నాను" అనెను.

బ్రహ్మచారి లేచి చూచి విస్మితుఁడై బహువ్యగ్రభావముతో, "తాము దయ చేసితి రేల?” అనెను. “దినము ముగిసె" ననెను. బ్రహ్మచారి “ప్రభూ ! నేఁడు క్షమింపవలయును; రాఁగల పున్నమనాఁటికి తమ యనుమతి ప్రకారము వర్తింతు” ననియెను.


ముప్పడియెనిమిదవ ప్రకరణము

సంతానుల విజయోత్సాహము

ఈరాత్రి మొదలు ఉదయమగువఱకును హరిధ్వనిచే వీరభూమి నిండి నిబిడీకృతమై యుండెను, సంతానులు గుంపులు గుంపులుగాఁ జేరి యెచ్చటఁ జూచినను ఉచ్చస్వరముతోఁ గొందఱు “వందేమాతరం” అనియును, కొందఱు "జయ జగదీశ హరే” అనియును పాడుచు తిరుగుచుండిరి. కొందఱు శత్రు సైన్యమునఁ బడియుండిన యస్త్రములను, కొందఱు వస్త్రము లను బరిహరింప నారంభించిరి. కొందఱు హతులైనవారినిం ద్రోక్కుచు నిజ గ్రామాభిముఖు లైరి. మఱికొందఱు నగ రాభిముఖులై చనిరి. వీరు చనునపు డెదురుపడినవారి నందఱను బట్టుకొని “వందేమాతరం” అని చెప్పుము, లేకున్నఁ, బ్రాణముతో విడుచుట "లేదని పీడించుట కారంభించిరి. కొం