ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఆనందమఠము


కల్యాణి —— దొంగలు దోఁచుకొని పోవుకాలము వచ్చినపుడు మన మిద్దఱముండి చేయున దేమి? ప్రాణమే పోయిన మీఁద సంపద ననుభవించువా రెవ్వరు? కూడినంతవఱకు భద్రము చేసి పోదము, బ్రదికియున్నచో వచ్చి యనుభవింప వచ్చును.

మహేంద్ర——నీవు నడుపఁగలవా? నీచేత నగునా ! బోయిలందఱు చచ్చిపోయిరి. బండియున్నదిగాని యెద్దులు లేవు. ఎద్దు లున్నను బండి లేదు. రెండు నున్న యెడల మనిషి లేఁడు. ఒకటియున్న మఱోకటి లేదు. కావున నడిచిపోవలసినదే.

కల్యాణ్ —— నేను నడిచి వచ్చెదను; తాము చింతింప నక్కఱ లేదు.

ఇట్లు చెప్పుచు కల్యాణి తనమనస్సున, 'నేను నడువ లేక మార్గ మధ్యమున గతించినను, వీ రిద్దఱైనను ప్రాణముతోఁ బోయి నగరము చేరనీ' యని తలంచెను.

మఱునాఁ డుదయమున కొద్దిగా ధనమును గైకొని, ఇంటికి బీగము వేసి, పసులను విప్పి విడిచి పెట్టి, బిడ్డను చంకనిడి కొని రాజధానికి ప్రయాణమైరి, కొంచెముదూరము పోయి మహేంద్రసింహుఁడు—— మనము పోవునట్టి మార్గము మంచిది కాదు, ఎచ్చటఁజూచినను కొల్లయే, దారిదోపిడి కాండ్ర నేకులు కలరు. చేత తుపాకియున్న మంచిది యని చెప్పి, యింటికిఁ బోయి తుపాకిని తీసికొనివచ్చెను. దీనిని చూచి కల్యాణి —— ఇది మంచిదే, చేత ఆయుధమున్న సమయమున కుపకరించును. కనుక నేనును పోయి యొక యాయుధమును తీసికొని వచ్చెద నని చెప్పి, బిడ్డను మగనిచేతి కిచ్చి, యింటిలోపలికి పోవుచుండెను.