ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైడవ ప్రకరణము

129


యున్న దని యనుకొనెను. కోపముచే శరీరమాద్యంతమును మండుట కారంభించెను. అయినను కంఠస్వర మతి మనోహరం బై స్వర్గ కవాటము తెఱువఁబడి వచ్చుచున్నదో యను నట్లుండెను. వినరాని కటూక్తులు మర్మ భేదియై యుండెను. జీవానందుఁడు లేచుటకును కూర్చుండుటకును ఇష్టము లేనివాఁడై యుండెను. ఉభయసంకటముగా నుండెను. తుదకు, “మహాశయుఁడా! ఈయిల్లు నాది; చాల కాలమునుండి నాయనుభవమున నున్నది. తాము బైటపొండు” అనెను.

శాంతి——ఈయిల్లు నాది; ఇప్పటికి ఒక గడియ ప్రొద్దుగా నాయనుభవమున నున్నది; కనుక తామే బైటికి పొండు.

జీవానంద——ఇది మఠముగా నుండుట చేత, దుడ్డుకఱ్ఱతోఁ గొట్టి నిన్ను నరకకూపంబున కనుపనై తిని, అయినను, ఇప్పుడే మహాస్వాముల యనుజ్ఞ నొందివచ్చి నిన్ను వెడలఁగొట్టెదను.

శాంతి—— నేను మహాస్వాముల యనుజ్ఞ నొందియే నిన్నుఁ దఱుమగొట్టెద; నీవు దూరముగా పొమ్ము.

జీవానంద—— మంచిది; ఈ యిల్లు నీది కాదుకదా? స్వాములవారినే యడిగివచ్చెదను; నీ పేరేమి? చెప్పుము.

శాంతి——నా పేరు నవీనానంద గోస్వామి. నీ పేరేమి?

జీవానంద——నా పేరు జీవానంద గోస్వామి.

శాంతి——నీవేనా జీవానంద గోస్వామివి ! కావుననే యిట్లు?

జీవానంద——ఎట్లు?

శాంతి——జనులు చెప్పుచున్నారు, నేనేమి చేయుదును?

జీవానంద—— ఏమని చెప్పెదరు?