ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము

119


శాంతి—— సంతానుల బాహుబలంబును తా మెపుడైనను పరీక్ష చేసి యున్నారా?

బ్రహ్మచారి—— పరీక్షించి యున్నాను.

ఇట్లని చెప్పి సత్యానందుఁ డొక యుక్కు ధనుస్సును, నొక యినుపతంతిని దెచ్చియిచ్చి, “యెవఁ డీధనుస్సున నీతంతిని గట్టి, వింటిని వంచి, టంకారము చేయునో, వాఁడే సంతానుఁ'డనెను.

శాంతి——వింటిని తంతిని చేతఁ దీసికొని చక్కఁగాఁ జూచి సంతాను లంద ఱీపరీక్షయందు ఉత్తీర్ణులైనా రా? యనియెను.

సత్యానంద—— లేదు. దీనిచే వారి బల మెంతటి దనునది నిశ్చయించుకొని యున్నాను,

శాంతి——అట్లయిన నెంద ఱీపరీక్షలో ఉత్తీర్ణులైన వారు.

సత్యానంద—— ఇరువురు మాత్రము,

శాంతి——ఎవ రెవ రని యడుగవచ్చునా?

సత్యానంద——చెప్పుటయందు నిషేధ మేమియు లేదు. నేనొకండను

శాంతి—— రెండవవా రెవరు?

సత్యానంద—— జీవానందుఁడు.

శాంతి——వింటిని తంతిని దీసికొని కొంచెమైనను శ్రమ లేక విల్లు వంచి, నిమిషమాత్రంబునఁ బూన్చి సత్యానందుని పాదముల సమీపమున పాఱవై చెను.

సత్యానందుఁ డాశ్చర్యభయంబు లొంది స్తంభితుఁ డాయెను. కొన్ని నిమిషముల కిదేమి? నీవు దేవివా? లేక మానవస్త్రీ వా!' యని యడిగెను.