ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము

మహేంద్రుఁడు శాంతిని దెలిసికొనుట

మహేంద్రుడు సత్యానందుని పదకమలంబుల కెఱఁగి, యనుజ్ఞఁ గైకొనియె. అతనితో నింకొక మనుష్యుఁడును దీక్షితుండై యుండెను. అతఁడును వచ్చి సత్యానందునికి మ్రొక్కెను, సత్యానందుఁ డాశీర్వదించి కృష్ణాజినము పైఁ గూర్చుండ నియమించెను, అనంతరము, యోగ క్షేమలాభములను గూర్చి ముచ్చటించుచుండి, 'కుమారా! నీకు స్థిరమైన భక్తి కలదా?' యని యడిగెను.

శిష్యుఁడు—— ఎట్లు చెప్పఁగలను? మన మెవనిని భక్తిగల వాఁడని నుడివెదమో యట్టివాఁడు శుద్ధ శుంఠయై యాత్మ ప్రతారణుఁ డై యుండును.

సత్యానందుఁడు సంతోషపడి, 'చక్కఁగా నుడివితివి; భక్తి నె ట్లతిక్రమింపవలయునో యావిధమగు అనుష్ఠానము చేయుము. నీ ప్రయత్నము సఫలము కానిమ్మని దీవించెను. ఏలన వత్సా నీవింకను బాలుఁడవుగా నున్నావు. నిన్నే పేరున పిలుతును? దానిని గుఱించి నేనిదివఱకు ఆలోచించలేదు.'

నూతనసంతానుఁడు—— తమమనంబునం దేపేరు తోఁచెడినో యా పేరునఁ బిలువవచ్చును. నేను వైష్ణవుల దాసాను దాసుఁడను.