ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116ఆనందమఠము

మరల చెప్పెను. “ఇపుడు మనకాశ్రయము లేదు.ప్రబల మగు సైన్యము వచ్చి మనలను అవరోధము చేసినయెడల మనము భోజన సామగ్రులను సంగ్రహించి తలుపు వేసికొని పదిదినములు నిర్విఘ్నముగా నుండుటకుఁ దగినట్టి స్థలము 'లేదు. మనకు కోట "లేదు; నీకు గొప్ప మేడ యున్నది. నీగ్రామము నీ యధికారమున నున్నది. నాయభిప్రాయ మేమనఁగా—— అచ్చటనే యొక కోటను నిర్మింపవలయును. కోటగోడనుండి పదచిహ్న గ్రామముచుట్టును అచ్చటచ్చట బురుజులను గట్టి వానిపై ఫిరంగి గుండ్ల నెక్కించినయెడల నుత్తమమయిన కోట యగును. నీవింటి కేఁగి నీయింటనే వసింపుము. క్రమక్రమముగా అచ్చటికి రెండు వేల జనులు సంతానులు వచ్చి చేరుదురు. వారిచే కోట కొత్తళములను నిర్మించు చుండుము. అచట నొక లోహనిర్మితమగు గృహంబును గట్టింపవలయును. అది సంతానుల అర్థ భాండాగారమున కుపయుక్త మగును, బంగారునాణెములు నిండించిన పెట్టెల నొక్కొక్కటిగాఁ బంపెదను. నీవాద్రవ్యముతో నీ కార్యంబు లన్నిటిని నిర్వహింప వలయును. మఱియు, నేను నానాదేశములనుండి శిల్పీశాస్త్ర నిపుణులను కూలిపని చేయువారలను బిలిచికొని వచ్చెదను, శిల్పశాస్త్రజ్జులు వచ్చిన వెంటనే నీవు పదచిహ్న గ్రామంబున నొక కార్య గృహంబును స్థాపించి, యచట మందుఁ గుండు ఫిరంగి, తుపాకి మొదలగువానిని తయారు చేయించవలయును. దీనికొఱకే నిన్నింటికి పోయి వాసము చేయుమని చెప్పుచున్నా" ననెను.

మహేంద్రుఁడును సమ్మతించెను.