ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

ఆనందమఠము

ఉపక్రమణిక

అతివిస్తృతం బైనయొకానొక యరణ్యంబునందు అధికాంశము సాలవృక్షంబులును, మఱియు ననేకములగు ఇతరజాతి వృక్షంబులు నుండెను. వృక్షశాఖలు వర్ణంబులతో దట్టంబుగా పెరిఁగి యాకాశము నంటఁబోవుచున్నవో యనునట్లుండెను. వెలుతురు చొరనంత దట్టముగా చెట్లసమూహ ముండెను. అనంత మైన పల్లవసముద్రము బహుదూరము వ్యాపించి యుండెను. గాలిచే వర్ణంబులు తగంగములవలె పైకి లేచిపోవు చుండెను. గాఢాంధకారము. పట్టపగటియందుఁ గూడ స్ఫుటమైన ప్రకాశము లేదు. భయంకరముగా నుండెను. మనుష్య ప్రవేశము లేదు. ఆకుల మర్మరశబ్దమును, వన్యమృగములయు, పక్షిజాతులయు శబ్ధమును తప్ప ఇతరధ్వని లేదు.

ఆ యరణ్యము విస్తారమై అతినిబిడమై అంధతమోమయ మైనది. అందులోను రాత్రికాలము, రాత్రియందును అర్ధరాత్రి, అర్ధరాత్రియందును అతిశయమైన అంధకారము, అరణ్యబాహ్యప్రదేశము నందును అంధకారమే; ఏదియుఁ గనబడదు. . అరణ్యములోపల భూగర్భమునందలి అంధకారము వలె తమోరాశి నిండియుండెను.