ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

అ శో కుఁ డు

నందలి మతధర్మముల వారెన్నఁడునుల్లంఘించుట లేదు. వారు సామాజక నీతిపద్ధతులకు విరుద్ధముగ సంచరించుట కెంత మాత్రము నిష్టపడెడు వారు కారు. ఈ సర్వవిషయముల యందును సమాజశాసనము లుండెను.

“ధనము” అన్నంతమాత్రమున నిప్పుడు నోటు, కంపెనీ పత్రము, మొహరీ. రూపాయ, వజ్రము, ముత్యము, బంగారము, వెండి, మొదలగునవి మనకు జ్ఞప్తికి వచ్చును. ఇప్పుడు రైలు స్టీమరు మొదలగు వాని సాహాయ్యమున సరకులను దేశవిదేశములకుఁ దీసికొనిపోవుటకు సౌకర్యము లున్నవి. బ్యాంకి నోటు, చీటీ, హుఁడీ, బంగారము, రూపాయలు మొదలగువాని ప్రచారమువలనఁ గ్రయవిక్రయములకు విశేషముగ సదుపాయములున్నవి. వర్తక ప్రచారము కూడ విచ్చలవిడిగ జరుగుచున్నది. పూర్వకాలమునందుఁ గృషికుఁడు తనయాహార పదార్థములను మాత్రము విక్రయింపక కేవలము ప్రత్తి, నార మొదలగు వానిని మాత్రము విక్రయించుచుండెడి వాఁడు. ఆతనికి వానిమూలమున నేవిశేష మూల్యము లభియించు చుండెడిది. ఇట్టి విశేష వ్యాపారము వలననే యనేకులు ధనవంతు లగుచుండిరి. ఇప్పుడు వర్తకమునందుఁ గ్రయవిక్రయములకు సదుపాయములుండుటచే వర్తకులును గృషికులకంటెను ధనికు లగుచుండిరి. ఈ కారణముచే ధనము పల్లెలయందేమి, నగరములయందేమి కొంత మంది యెద్ద మాత్రమే నిలువఁ బడిపోవుచుండెను.