పుట:2030020025431 - chitra leikhanamu.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది

ఒకేజాతిచెట్ల నొకేవిధముగ వ్రాయజాలము. వృద్ధవృక్షములు బాలవృక్షములు నొకేవిధముగ నుండవు. బాలవృక్షములబెరడు మిగుల కోమలముగ నుండును. ఆకులు అంతదట్టముగ నుండవు. కాని ఆకులులేనికొమ్మలు మాత్ర ముండవు. మధ్యవయసుగలచెట్లయం దాకులు దట్టముగ నుండును. కాని అచ్చటచ్చట ఆకులులేనిశాఖ లుండును. వృద్ధవృక్షములయందు ఆకులు విస్తార ముండవు. బెరడు మిగుల కరకుగ నుండును. చాలకొమ్మలు విరిగిపోయియుండును. ఇట్టివణ్ణియు చూచుచుండవలెను.

వివిధపరికరముల నుపయోగించి చెట్లను వ్రాయుట.

అనేకపరికరముల నుపయోగించి చిత్తరువులును వ్రాయవచ్చునని పుస్తకప్రారంభమునందే చెప్పియుంటిని. వృక్షపటములను వ్రాయుటయందు ప్రసిద్ధిగాంచిన చిత్రకారులు, మెత్తని పెన్సిలును, నీరురంగులను, నూనెరంగులను ఉపయోగించెదరు. కాని యీపుస్తకమునందు నూనెరంగుల విషయమై చెప్పుటకు నిశ్చయించుకొనలేదు.

పెన్సిలును మనము సాధారణముగ చెక్కినటుల చెక్కగూడదు. పెన్సిలుయొక్క సీసమును గసి (Wedge) ఆకారముగ చెక్కవలెను. దీనితో మనయిష్టప్రకారము సన్నముగా గాని వలముగాగాని గీతలను గీయవచ్చును. కాన నిట్టిపెన్సిలుకొన మనకు చాలయుపయోగకరముగ నుండును. చెట్టుయొక్క మొండెమును వ్రాయునప్పుడు సన్నని గీతలును, దట్టమైనగీతలును కావలసియుండును. ఆకులను వ్రాయునప్పుడు సన్ననిగీత లుపయోగకరముగ నుండును.

ఆకులు వ్రాయుటయందు మిక్కిలి ప్రావీణ్యము గలిగియుండవలెను. వీటిని వ్రాయుట కనుగుణ మైనగీతల నభ్యసింపవలసియుండును. తఱుచుగ వ్రాయుచుండుటవలననే వచ్చును కాని పుస్తకములను చదివినంత మాత్రమున నలవడదు. సంగీతగ్రంథములను చదివినవారందఱును కృతులను పాడగలరా? అటులనే చిత్ర లేఖనమం దభ్యాసముండవలెను. కొందఱు సంగీతవిద్యార్థులు సంవత్సరములకొలది కష్టపడి సంగీతవిద్య నభ్యసించి బాగుగ గానము చేయలేకున్నారు. ఇట్టివిద్యలు పట్టుబడుట కష్టమగుటచేతను, వారు మంచిమార్గమున నభ్యసింపకపోవుటచేతను యీకళయందు ప్రవీణులు కాజాలక యున్నారు. అందువలన చిత్రలేఖనమును బహుశ్రద్ధాభక్తులతో నేర్చుకొనవలెను.

చాలయభ్యాసమువలన మనహస్తము నుపయోగించుట నేర్చుకొనవలెను. పెన్సిలును కొనవద్ద పట్టుకొనరాదు. మెల్లగ పెన్సిలుతో వ్రాయుట నభ్యసింపవలెను.

మొదట సన్ననిగీతలతో చెట్లపైయాకారములను వ్రాయవలెను. ఈవిషయము చాలముఖ్యము. పైయాకారమును చక్కగ వ్రాయనిది చెట్టును పూర్తిచేయరాదు. మొండెమును కనబడుచున్నకొమ్మలను మొదట చిత్రించవలెను. తరువాత నీచిత్రము బాగుగ నున్నదో లేదో చూచుకొని వివరములను కొంచెము దట్టమైనగీతలతో చిత్రింపవలెను. మనచిత్రమునుబట్టి యీగీతలు మాఱుచుండును. మోటుగ వ్రాయవలెనన్న దట్టమైన పెద్దగీతలతోను, నాజూకుగ చిత్రింపవలెనన్న సన్నని చిన్నగీతలతోను వ్రాయవలెను. ఏవిధమున వ్రాసినను ప్రకృతిచిత్రము ననుసరింపవచ్చును. వివిధజాతులచెట్లను చక్కగ పైజెప్పినరెండువిధముల వ్రాసి ప్రదర్శింపవచ్చును.

ఈవిధముగనే సుద్దతోను, మసిబొగ్గుతోను వ్రాయవచ్చును. దేనితో వ్రాసినప్పటికిని ఈవిద్య నీవ్రేళ్లకొనయం దుండునటుల నభ్యసింపవలయును. మనుజునిరక్తి కంతములేదు. దీని నెంతయభ్యసించిన నంతయభివృద్ధినొందును.

నీరురంగులు వృక్షపటమునకు వన్నెతెచ్చును. ఇతరచిత్రములయందువలె దీనియందు రంగును సమముగ పూయుచు వచ్చినంతమాత్రమున లాభములేదు. మొదట నొకరంగును పలుచగ చెట్టునకువేసి యిది బాగుగ నారకముందు మఱియొకరంగును వేయవలసియుండును. ఏరంగును వేయవలసియుండునో మీరే యాలోచింపుడు. ఇందుకు ఏయేరంగులను కలిపిన నేరంగు వచ్చునో బాగుగ తెలిసియుండవలెను.

చెట్లను రంగులతో చిత్రించుటయం దొకయాకుపచ్చనే యుపయోగించుట తప్పు. అనేకరంగుల నుపయోగించవలసియుండును.