పుట:2030020025431 - chitra leikhanamu.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి భాగము.

పసుపువర్ణమును దట్టము చేసిన, మట్టిరంగుగనో ఆకుపచ్చగనో మాఱును. పలుచన చేసిన, బూడిదవర్ణముగ మాఱును. లేనియెడల నారంగు శుభ్రముగ మాయమై పోవును. నీలియందు మార్పు లేమియు లేవు.

ఏదోయొకరంగును తీసుకొని చాయను సులభముగ నీయగలము. ఈగుణము చిత్రకారులకు చాల సహాయకారిగా నున్నది. సాధారణముగ మన మొక పెన్సిలును చేతనిడుకొని చిత్రమును వ్రాయ మొదలిడిదము. సృష్టియందిటులకాదు. ప్రతివస్తువును రంగులతో మిశ్రితమై యుండును. అందువలన మనము చిత్రములను వ్రాయుటయందు సృష్టి ననుసరించుట యుత్తమము.

వస్తువుయొక్క రంగునుబట్టి చాయ మాఱుచుండు నని మనము సాధారణముగ తలతుము కాని యీ చాయను వెలుతురుకూడ మార్చుచుండును.

ఎఱుపువర్ణము బాకాయొక్క ధ్వనికి పోల్పబడినది. నీలిరంగు పిల్లనగ్రోవియొక్క శబ్దమునకు సరిపోల్పబడినది.

మన యిష్టానిష్టములప్రకారము వాసనవచ్చునటుల వాసనద్రవ్యములనుకలిపెదము రుచికలుగునటుల తిను బండారములను వండెదము. అటులనే మనమనస్సునకు తృప్తి కలుగునటుల రంగులను కలుపవలెను.

ఏలయన: చక్కని యత్తరును, మంచి సంగీతమును, రుచియైన భోజనమును, మనముప్రేమించునటుల నయనానందమును కలుగజేయు చిత్రమును చూచుట కభిలాషపడెదము.

సంగీతవిద్యార్థి ప్రథమమున మంచి కృతులను పాడలేడు. అభ్యసించినకొలది వానిజ్ఞాన మావిషయమున నభివృద్ధిపొంది తుదకు కర్ణానందముగ గానము చేయగలడు. అటులనే మనము ప్రతినిముషమును సృష్టిని చూచునప్పటికిని ప్రథమమున చక్కగా రంగులతో చిత్రములను వ్రాయజాలము. అభ్యసించినకొలది నీవిద్య అబ్బును.

కొందఱు మొదట కొన్నిరంగులకు భేదము కనుగొనలేరు. అభ్యాసము చాలకపోవుటయే దీనికి కారణము.

కొందఱు ఒకచేతితోనే వ్రాయగలరు. మఱికొందఱు రెండు హస్తములతోను చిత్రింపగలరు. దీనికని అభ్యాసమే ముఖ్యము. గుఱ్ఱమును ఒంటెవలె నడిపింపవచ్చును. ఒంటెను పిల్లివలె నడిపింపవచ్చును. అటులనే ఎడమచేతిని కుడిచేతివలెనే పనిచేయింపవచ్చును. ఫిడిల్ వాయించువాడు రెండుచేతులను ఉపయోగించును. ఏ చేయి చేయవలసినపని నది చేసివేయుచుండును. అటులనే మన మభ్యసించినయెడల రెండుచేతులతోను వ్రాయవచ్చును.

మనము కొంచెము ఇంధ్రధనస్సువైపు చూతము. అందు ఏడురంగులు కాన్పించును. 24 - 2 చూడుము.

మనము చిత్రమును వ్రాసినప్పుడు ఇష్టము వచ్చినటుల వ్రాయుటకు వీలుండదు. కొన్ని నిబంధనలకు లోబడవలసివచ్చును.

చిత్రములను చిత్రించుటకు 5, 2, నెంబరుల విండ్సర్, న్యూటను కుంచెలు (Windsor and Newtons' Red Sable hair brushes Nos. 5 and 2.) కావలసియుండును.

క్రొత్తవారు నేర్చుకొనుట కేదైనరంగును దట్టముగ నరుగదీసి వలయాకారములయందారంగును పూయుచుండవలెను. తరువాత నీవలయాకారములద్వారా అక్షరములను వ్రాసి యొక్కొక్కవలయమునకు నొక్కొక్కరంగును పూయుచుండవలెను. సాధారణముగ నని యీదిగువచెప్పినప్రకారము పూసిన సుందరముగ కనబడును.

1. ఎఱుపు. 2.ఊదా. 3. గాఢనీలము. 4. నీలము. 5. ఆకుపచ్చ. 6. పసుపు. 7. నారింజ.

24 - 3 చూడుము.