పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 98

వాఙ్మయమంతటిని పరిశోధించిన మహావిద్వాంసులు. వారు భారతదేశమున నడుగిడునప్పటికి చిన్నయసూరి పదునాల్గేండ్ల వాఁడు. చిన్నయసూరి పరమపదించుట కే డేండ్లకు పూర్వమే యాతఁ డీ దేశమును విడిచి వెళ్లినాఁడు. కావున వారిర్వురికిని, సమకాలికులైననను, సంబంధ మేమాత్రమును లేదు.

చిన్నయసూరి కుటుంబము - అతని వ్యక్తిత్వము

చిన్నయ తన యుద్యోగధర్మమును నిర్వహించుచు సుఖజీవనమును గడపుచుండెడివాఁడు. ఈతని కిరువురు కొమరులు. వారిలో ద్వితీయునికి శ్రీ రేకము రామానుజసూరిగారి పుత్రిక నిచ్చి వివాహ మొనర్చిరి. ఈ రామానుజసూరిగారే చిన్నయసూరివెనుక నాతని స్థానము నధిష్ఠించిరి. ఈయన కిరువురు కొమారులు. వారిలో ప్రథములు శ్రీ రేకము మణవాళయ్యగారు; రెండవవారు భాష్యకారులుగారు. మణవాళయ్యగారు సబ్‌జడ్జి పనిని నిర్వహించుచు హైదరాబాదులో మూసినదీ ప్రవాహమున మరణించిరి. వారివద్ద సూరివృత్తాంతము కొంత యుండెను. కాని వారి మరణముతో నదియు నంతరించెను. మరియు రెండవవా రగు భాష్య కారయ్యగారు తమ డెబ్బది యెనిమిదవయేఁట తమకు చిన్నయసూరిని గురించి తెలిసిన వృత్తాంతమును కాగితము మూలముగా వ్రాసియిచ్చిరి. దాని నుండియే పరిషత్తువారి సంపుటములయందు నీచరిత్రము ప్రకటింపఁబడినది.