పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

2. జననము - విద్యాభ్యాసము

చిన్నయసూరి చాత్తాదవైష్ణవ సంప్రదాయమునకుఁ జెందినవాఁడు. వీరినే 'సాతాను' లని యందురు. వీ రుభయ వేదాంత ప్రవర్తకులగు వైష్ణవాచార్యులతో సమానప్రతిపత్తి గడించినవారు. చిన్నయసూరి పూర్వికు లుత్తరదేశస్థులు; పరవస్తు మఠ మను నొక మఠమువారి శిష్యులు. వీరికిని బ్రాహ్మణులవలె సూత్రగోత్రములు గలవు. సూరిగారు ఆపస్తంబ సూత్రులు; గార్గేయ గోత్రులు; యజుశ్శాఖాధ్యాయులు. వీరి తండ్రిగారు వేంకటరంగరామానుజాచార్యులుగా రుభయ వేదాంత ప్రవర్తకులై, చెన్నపురమున తిరువళ్ళిక్కేణిలోని రామానుజకూటమునందు శిష్యులకు వైష్ణవమతసిద్ధాంతములను బోధించుచుండిరి. ఇట్లుండఁగా కొంతకాలమునకు శ్రీ ప్రతివాది భయంకరము శ్రీనివాసాచార్యులవారు వీరి బోధనా శక్తిని గమనించి వీరిని శ్రీ రామానుజులవారి జన్మస్థలమగు శ్రీపెరంబూదూరునకుఁ దీసికొనిపోయిరి.

అచ్చట కోవెలయందు వీరిని ద్రవిడ వేదపారాయణా ధ్యాపకులుగా నియమించి, తగిన వసతు లేర్పఱచిరి. శ్రీపెరంబూదూరున రామానుజాచార్యులవారు నివసించుచు నచ్చటికి వచ్చినవారి నందఱిని వైష్ణవమతప్రవిష్టులుగా నొనరించుచుండిరి. వీరు ద్రవిడవేదమేకాక సంస్కృతము, ప్రాకృతము, ద్రావిడము, తెనుఁగు మొదలగు భాషలు చక్కఁగా తెలిసినవారు. కనుక