పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/82

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 85

చిత్తుప్రతి యని చెప్పనొప్పును. పేరునకు చిత్తుప్రతియేగాని సూరి ఎక్కడను నొక్క తుడుపైనను లేకుండ వ్రాసి యున్నాఁడు. కాని వ్రాయవలసిన విషయములు వ్యత్యస్తముగా నుండుటచే క్రొత్తవానిని చేర్చి తిరిగి దానిని సాఫీగా వ్రాయవలసివచ్చినది. మరల నట్టి నిఘంటువు ప్రథమ సంపుటము సూరియే స్వయముగా వ్రాసియున్నాఁడు. *[1] ఇందులోని పదములు సూర్యరాయాంధ్ర నిఘంటువున తీసికొనఁబడి "చి. ని" అను సాంకేతికముతో చూపఁబడినవి. ఈ నిఘంటువులే కాక ఆతఁ డే యే గ్రంథములనుండి పదములను తీసెనో యవి కూడ భద్తపఱుపఁబడినవి. వానిలో నీ క్రింది గ్రంథములు కలవు.

1. కవిత్రయరచితమహాభారతము, 2. మహాభాగవతము, 3. భాస్కర రామాయణము, 4. నిర్వచనోత్తర రామాయణము, 5. పద్మపురాణము, 6. శృంగారనైషధము, 7. కాశీఖండము, 8. భీమఖండము, 9. హర విలాసము, 10. సింహాసనద్వాత్రింశిక, 11. చంద్రాంగదచరిత్రము, 12. దాశరథీశతకము, 13. లావణ్యశతకము, 14. హరభక్తవిలాసము, 15. ఆంధ్రభాషార్ణవము మున్నగునవి.

పై ప్రణాళికనుబట్టి నిఘంటు పదములను చిన్నయసూరి మూలగ్రంథములనుండియే పరిశీలించి గ్రహించెనని తెలియఁదగును.

  1. * ఇవి చాలకాలమువఱకు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున నుండెడివి. నేఁడెక్కడ నవిలయమైనవో తెలియుట లేదు.