పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 11

సంప్రదాయములతో సమ్మేళనము చేసెను. ఇట్లీరెండు పద్ధతులను జోడించుటవలన నాంధ్ర వాఙ్మయ చరిత్రలో నొకవిధమగు నూతనచైతన్యము గల సంస్కృతి యుత్పన్నమగుటకుఁ దగిన యవకాశ మేర్పడినది.

ఈపద్ధతి పండితజనసమ్మతమగుటచేత నుత్తమసాహిత్య విద్యావ్యాప్తికి నెంతేని తోడ్పడినది. కాఁబట్టియే చిన్నయ సూరిని నవ్యవాఙ్మయయుగపురుషులలో నొకనిగా మనము పరిగణింపవలయును. అతఁడు నవీనోద్యమము లన్నిటియందును పాల్గొని యానాఁటి సాహిత్యప్రపంచమునకు నియంతగా నుండిన మహారథుఁడు.

అయిన నీనాఁటి వాఙ్మయచరిత్రకారుల కేమి, పండితులకేమి చిన్నయసూరి సమగ్రజీవితము తెలియకపోవుటచేత నవ్యాంధ్రవాఙ్మయ ప్రపంచమున నాతనికిఁ గల యగ్రస్థానము గుర్తింపఁబడలేదు. రాఁబోవు ప్రకరణములలో నాతఁ డేవిధముగా నీ నవీనోద్యమరథమును నడిపించి యజరామరకీర్తి గడించి శకపురుషుఁ డయ్యెనో చదువుదము.