పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 80

చాలఁ బ్రసిద్ధి వహించియుండిన పరవస్తు చిన్నయసూరిగారు జీవితులై యుండినకాలమున దీర్ఘ సూత్రతతో ననేక గ్రంథ పరిశోధనంబు గావించి మిగుల విరివిగఁ, బ్రయోగ సహితంబుగ అకారాది తెనుఁగునిఘంటునొకటి వ్రాయ ప్రారంభించి నడపుచుండిరి. ఆ మహాప్రారంభము చూచి యది పరిపూర్తియగుటకు బహుకాలము చెల్లు ననియుఁ, బరిపూర్తియైనను నందు తెనుఁగుపదములుమాత్రమే చేర్పఁబడియుండుటంజేసి యది విద్యార్థుల కంతగా ప్రయోజనకారి కాఁజాల దనియు, నిదిగాక బడులయందుఁ జదివెడు విద్యార్థు లంత పెద్ద పుస్తకము కొని యుంచుకొనుట కష్టముగా నుండుననియు నూహించి ...........అకారాదినిఘంటు వొకటి వ్రాసి శీఘ్రకాలముననే పూర్తిచేసెదఁగాక యని మిక్కిలి పూనికతో దీని వ్రాయ నుద్యమించితిని."

పై నుదాహరించిన యంశమునుబట్టి చిన్నయసూరికి ముందు నిఘంటువులయందు కొన్ని లోపము లున్నవనియు, నా లోప నివారణార్థము చిన్నయసూరి ఈ నిఘంటురచనమును ప్రారంభించెననియు స్పష్టమగుచున్నది. పూర్వనిఘంటువుల స్వరూపమెట్టిదో, వాని గుణాగుణము లెట్టివో మనము తెలిసికొనినఁగాని చిన్నయసూరి రచనమునందలి విశిష్టతను మనము గ్రహింపఁజాలము. సంస్కృతమునకు బహుప్రాచీనకాలము నుండియు నిఘంటువు లున్నను తెనుఁగుభాషలో క్రీ. శ. 17 - వ శతాబ్దినుండియే బయలుదేఱినవి. తత్సమపదములను విడిచి యచ్చతెనుఁగుభాషలో కావ్యములు వెలయుటయే యీ నిఘంటు రచనమునకు దారి తీసినది. ఈ తెనుఁగు నిఘంటువు లన్నియును పద్యాత్మకములును, పర్యాయపదములు తెలుపునవియు నై యున్నవి.