పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 69

మగు రీతినే యవలంబించిరి. వ్యాకరణ విషయములు మనస్సునకు పట్ట నట్లుగా రచించుటయే వారి లక్ష్యముకాని పరంపరా యాతమగు భాషా పరిణామమును నిర్వచించుటకును, ప్రాచీన ప్రయోగముల లక్ష్య లక్షణ సమన్వయము చేయుటకును వారు పూనుకొనలేదు. చిన్నయసూరి క్రీ. శ. 1858 లో బాలవ్యాకరణమును ముద్రించునాఁటికి తెనుఁగున పై పండితులు వ్రాసిన యీ క్రింది వ్యాకరణములు ప్రచారములో నుండెడివి.

1. పట్టాభిరామ పండితీయము: వేదము పట్టాభిరామశాస్త్రి కృతము. ఇది యాంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్య. ఇతఁడె యాంధ్రశబ్దానుశాసన మను నొక వ్యాకరణము తెనుఁగున పద్యరూపముగ రచించెను. దీని రచనా కాలము 1816.

2. గురుమూర్తిశాస్త్రి వ్యాకరణము: ఇది ఫోర్టుసెంటుజార్జి కళాశాలలో ప్రధానపండితులగు రావిపాటి గురుమూర్తిశాస్త్రి కృతము. దీని రచనా కాలము 1836. ఇది విపులమగు వ్యాకరణము. దీనిని చిన్నయసూరి పాఠము చెప్పియున్నాఁడు. ఆ కాలమున నిది చాల ప్రచారము గాంచినది.

3. ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము: పుదూరి సీతారామశాస్త్రి కృతము. పేరునుబట్టియే దీని స్వరూపము తెలియఁగలదు. ఇందు ప్రశ్నలును, జవాబులును కలవు. 1852 లో నిది ముద్రితము.

4. ఉదయగిరి శేషయ్యశాస్త్రి వ్యాకరణము: ఇది 1856 లో వెలువడినది. ఇదియును ప్రచారములో నున్న దే.