పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 66

తొలుదొల్త తెనుఁగునందే రచితములైనవి. *[1] వానిలో కేతన రచించిన 'ఆంధ్రభాషాభూషణ' మను వ్యాకరణ మొదటిది. ఆ వెనుక కవులు రచించిన కావ్యములను పరిశీలించి వైయాకరణులు ప్రయోగములను సేకరించి, వానిని ప్రచారమున నున్న వ్యాకరణసూత్రములతో సమన్వయము చేయ నారంభించిరి. వీనికే లక్షణ గ్రంథము లని పేరు. క్రమక్రమముగా తరువాతి పండితులు కవిప్రయుక్తములై లక్షణగ్రంథములచే నంగీకృతములైనవానినే గ్రంథములందు ప్రయోగించుచు కేవల వ్యాకరణము ననుసరించుట మానిరి. అందుచే కేతన వెనుక వ్యాకరణశాస్త్రమే ప్రధానముగాఁ గాక దానితో ఛందశ్శాస్త్రమునుగూడ పండితులు రచించిరి. విన్నకోట పెద్దన ఛందోవ్యాకరణములను రెండిటిని రచించినాఁడు. అనంతుని ఛందస్సున నట్లే ఛందోవిషయము ప్రధానముగను, వ్యాకరణ విషయ మప్రధానముగను నున్నవి. తాతంభట్టు రెండిటినిగూర్చి "కవిచింతామణి, ఛందోదర్పణ" మను రెండుగ్రంథములను రచించెను. ఇవియన్నియు తెనుఁగున పద్యరూపమున రచితములు. అటుపిమ్మట లింగముగుంట తిమ్మన, ముద్దరాజు రామన్న, కూచిమంచి తిమ్మకవి మొదలగు లాక్షణికులు కేవల కవిప్రయోగములనే ప్రమాణీకరించి లక్షణగ్రంథముల రచించిరి.

వీరు ప్రమాణీకరించిన భాష నన్నయభట్టారకాది కవి

  1. * తెలుఁగులో కావ్యభాషకే - అనఁగా కవిప్రయుక్తభాషకే వ్యాకరణము. "ప్రయోగశరణా వైయాకరణా" అను సూక్తి తెలుఁగు వ్యాకరణమువలనఁ గలిగినది.