పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 41

వచనరచనా పథకము మార్పుచెందినది, అప్పటికి దక్షిణ దేశమందు వచనరచనలున్నను యవి యజ్ఞాతదశ నుండి యా కాలపు పండితులకుఁగూడ నందుబాటులో లేకుండెను. *[1] అంతకు ముందుగనే వెలసిన పై వచనరచన లీనూతనప్రణాళికకు సరిపోయినవి కావు. మఱియును విద్యాశాఖయందలి పద్ధతుల ననుసరించి కొన్నివర్ణనలపట్ల నౌచిత్యమును పాటించి త్యజించవలసివచ్చినది. విద్యార్థుల భావిసాహిత్యాభివృద్ధి కనుకూలపడునట్లు నైతికముగను, నుదారముగను, గంభీరభావములను నూతనరీతిని వివరింప సమర్థత గల లాక్షణికగ్రాంథికశైలి గల వచనరచన లత్యావశ్యకములైనవి. ఇట్టిసమయముననే చిన్నయసూరి తన నీతిచంద్రికతో వచనసాహిత్యా కాశమున నుదయించి యశశ్చంద్రికల నలుదెసల వ్యాపింపఁజేసెను.

నీతి చంద్రిక

'నీతి చంద్రిక' యనునది కథా వాఙ్మయమునకు సంబంధించిన రెండు గ్రంథముల సంపుటీకరణము. ఒకటి నారాయణ పండిత కృతమైన హితోపదేశము; రెండవది విష్ణుశర్మ కృతమగు పంచతంత్రము. ఇవి రెండును సంస్కృత భాషయందు బహు ప్రాచీన కాలమునుండి ప్రపంచ విఖ్యాతిఁ బడసినవి. వీనిలో పంచతంత్రము క్రీ. శ. ఆఱవ శతాబ్దమునకే పాశ్చాత్య ఖండములో గ్రీకు భాషలోనికేగాక యరబ్బీ

  1. * ఆనాఁడే కాదు. ముప్పదేండ్ల క్రిందటివఱకును నీకాలమువారికే యవి యందుబాటులో లేకుండెడివి.