పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/27

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 30

అట్టిసభకు విద్యాధికారియగు ఆర్బత్ నాటుదొరగారు ముగ్గురు మహావిద్వాంసు లగు పండితులను పిలిపించి, చిన్నయసూరిగారిని పరీక్షింపఁగోరిరి. కాని యాసభలోనే పురాణము హయగ్రీవశాస్త్రిగా రను పండితుఁడు తానుకూడ నొక యభ్యర్థిగా నుందు నని సభలో వెల్లడించెను. అది చట్టమునకు కొంత విరుద్ధమైనను పండితుల ప్రోద్బలముచే ఆర్బత్ నాటుదొర యంగీకరించెను. వీరిరువురను పండితులు పరీక్షించిరి. అందులో చిన్నయసూరిగారినే ప్రథమగణ్యునిగా పరీక్షితు లేకగ్రీవముగా తీర్మానించిరి. తత్క్షణమే యాతఁడు రాజధాని కళాశాలలో ప్రధానపండితుఁడుగా క్రీ. శ. 1847 లో నియమితుఁ డయ్యెను.

అందు నియమితుఁడైన దినమునుండియు చిన్నయసూరి కడు జాగరూకతతో తన పండిత పదవి నిర్వహించుచు నచిర కాలములోనే యార్బత్ నాటు దొరవారి యాదరాభిమానములను చూఱగొనెను. విశ్వవిద్యాలయమునకు మూలభూతమగు నీ కళాశాలాధ్యక్షుఁడే యాకాలమున మదరాసు రాజధాని కంతటికి విద్యాశాఖాధికారిగ నుండుటచేత ఆ కళాశాల పండితులకు, వారి గ్రంథములకు దేశములో విశేషమగు పలుకుబడి, వ్యాప్తి యుండెడివి. ఆర్బత్ నాటు దొర దేశ భాషా పండితులను ప్రత్యేకముగా గౌరవించు స్వభావము కలవాఁడు. ఆ కాలమున కళాశాల పండితులందఱు 'శాస్త్రి' యను నుప నామమును ధరింపవలసిన నియమము కలదు. తెనుఁగుదేశపు సంప్రదాయము ననుసరించి వైదిక శాఖలో బ్రాహ్మణులు