పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 17.

లగు భాషలను నేర్చెను. కంచి రామానుజాచార్యులవారి యొద్ద తర్కము, మీమాంస, అలంకారముల నభ్యసించెను. శ్రీరామాశాస్త్రు లనెడు నొక వైదికవిద్వాంసునియొద్ద వేదమును, వేదార్థమును గ్రహించెను. వారివలననే చిన్నయసూరి యనితరలభ్యమగు హయగ్రీవమంత్రము నుపదేశముపొందెను. ఈ మంత్రోపదేశమువలన చిన్నయసూరి తన పాండిత్యమునకు తోడుగా వేదాంతవిజ్ఞానసంపత్తినిఁ బడసెను. తన కాలములో నంతటి ప్రతిష్ఠ సంపాదించుట కీమంత్రోపాసనాబలమే కారణము. కేవలము ప్రత్యక్షప్రమాణవాదులగు నీనాఁటివారికి నిట్టి సంఘటనలు విడ్డూరముగాఁ గానవచ్చును. కాని యాకాల మందలి మఱికొంతమంది కవిపండితుల చరిత్రలు పరిశీలించిన నిది యథార్థ మని గోచరింపక మానదు.