ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. వ్యాసములున్ విమర్శనలు భావకవిత్వరసైక చారు వి
    న్యాసములున్ మతాంతరమహాపరివర్తన తత్త్వరూపకో
    పాసనముల్ పురాణములు వ్రాసితి భారతభూమి నే నుప
    న్యాసము లిచ్చుచున్ దిరిగినాఁడను "ఉమ్రలిషా" కవీంద్రుఁడన్.

ఉ. వేలురచించి విద్యలనుబెట్టి గడించితి పారితోషికా
    ద్యాళిని వేయినూట పదియార్లను సింహతలాటముల్ మహా
    భీలకసత్కళాకనక విశ్రుతముల్ జయభేరి మ్రోయ హిం
    తాల వనీనటత్కుకవి తండము లేమిటి లెక్క మాకడన్.

సీ. సాధించితిని యోగసాధనంబులు హిమా
           గమ మెక్కి మతిని చక్కాడియాడి ;
    భోధించితిని జ్ఞానసాధనక్రమములు
           చెవినిల్లుగాఁ జేసి చెప్పి చెప్పి ;
    సవరించితిని పెద్దసారస్వతంబును
           శబ్దశాస్త్రంబులు జదివిచదివి ;
    చూపించితిని రాజ్యలోపంబు లాంగ్ల ప్ర
           భుత్వంబు ముంగరమోపి మోపి.

తే. ఇప్పుడప్పుడె నలుబదియేండ్లపైన
    దాఁటిపోయెను వయసు నీనాటికైన
    శాంతి గలుగదు నీ కళాధ్వాంతమందు
    జీవితము తెన్ను సుడిబోవు నావబోలు.

మ. నను నీజ్ఞానమహాసభాసదులు నానందాన నర్ధించి 'ఆ
     దిని మీపూర్వపితామహుల్ గురువులై దివ్యత్వమేసారఁగా
     ఘనవిజ్ఞానకళాప్రవృషి ప్రజహృత్కాంతారముల్ నింపి రా
     మని మీరాకృతి బోధసేయఁదగు 'ఉరమ్రాలీష' భాషాగతిన్.

మ. అని నెయ్యంబునఁ గోరఁగావిని మహాహర్షంబు సంధిల్ల నౌ
     నని యా జ్ఞానమహాసభాకథన మత్యంతంబు కష్టంబు మే
     దిని సంసారనిమగ్న మానసులు నర్థింపంగ సాధ్యంబు గా
     దని యున్నంత నెఱుంగసేతునని నే నారంభమున్ జేసితిన్.