ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

ఉమర్ ఖయ్యామ్

643

కనఁబడులోక మాస్తికము గాదిది కేవలభ్రాంతి ; భ్రాంతిలో
మునిఁగియు దీర్ఘదుఃఖములఁ బొంది నశించెద వేల ? ప్రాప్తమం
చనుకొని యోర్చుకొమ్ము ; ప్రతియాపద నొస్టలిఖించినంతె వ
చ్చును ; బ్రతిపత్తిమార దెటుచూచినఁ దృప్తిని బొందు చిత్తమా !

644

లెమ్ము ! నశించి పోవు నవలీల, జగమ్మునుగూర్చి సుంత దుః
ఖమ్ము వహింపఁబోకుము ; సుఖంబునఁ బుచ్చుము కొన్నినాళ్లు శాం
తమ్ముగ ; విశ్వ మన్నది కృతఘ్నతసేయనిదేని నిన్ను ని
క్కమ్ముగ నేరవచ్చునె యొకానొక వ్యక్తిని డాసియుండకే.

645

పాడుధరిత్రి దుఃఖములఁ బాడొనరింపకు జీవితంబు ; నే
నాఁడొ నశించునట్టి స్వజనంబును వేఁడకు ; నీమనంబు వె
న్నాడఁగ నే సరోజనయనాలకలందునొ కట్టివైచి మా
ఱాడక మద్యపానవివశాత్ముఁడవై చరియింపు మర్థివై.

646

సుంతయు వ్యర్థదుఃఖముల స్రుక్కకు ; సంతసమందు జీవితం
బెంతయుఁబుచ్చు ; మీజగము న్యాయములేనిది ; యైన న్యాయమం
దెంతయు నీవు నిల్చి కనుమీ యిది శూన్యము ; నీవు శూన్యమే
యింతకుమున్నె ; యీనిజ నెఱింగి స్వతంత్రుఁడవై చరింపుమా.