ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము 4 : అంత:పురము

________

[తెరయెత్తునప్పటికి యశోధర దీనవదనయై పైఁటకొంగుతో కన్నీరు తుడుచుకొనుచుండును. రాజశేఖరుఁడు ప్రవేశించును]

రాజశేఖరు : అమ్మా, యెందుకు రమ్మంటివి?

యశోధర : నాయనా, యిటురమ్ము, కూర్చుండుము.

రాజ : [అమ్మప్రక్కన కూర్చుండును.]

యశో : శేఖరా, యిఁక మనమేమిచేయఁగలము? మీ తండ్రిపట్టిన పట్టు విడువకున్నాఁడు. ముసలితనపు ముక్కోపము; నేనేమి చెప్పఁబోయినను అవిధేయనని శంకించుచుండును. తండ్రినిశ్చయమును విని మనోరమ రేయుం బవలు తనలో తాను కుమిలి కుమిలి పరితపించుచున్నది. రెండుదినముల నుండియు మంచినీరైన త్రావక కృశించుచున్నది. కన్నీరు నించి నించి కనుఱెప్పలు వాచిపోయియున్నవి. ఆ బిడ్డదురవస్థ చూచినప్పుడు కన్నకడు పెట్లు దరికొనక పోవును? నాయనా, యీఁడువారి మనసుకోఁతలు మీకేమి తెలియును?

రాజ : అమ్మా, మనోరమను విజయవర్మకిచ్చి వివాహము చేయుట నాకును అంత సమ్మతముకాదు. నిన్న ఆయన విడిదికి పోయియుంటిని. నేను పోవునప్పటికి ఏలనో కోపోద్రిక్త మానసుఁడైనటుల నిప్పులు గ్రక్కు వాడిచూపులతో బయ లవలోకించుచుండెను. ఆతతాయి క్రూరస్వభావమును ప్రతిబింబించుచుండిన ఆతని ముఖము నన్ను చూచిన తత్క్షణమె దరహసిత దీప్తమై వింతగొల్పినది.

యశో : నాయనా, ఆయన అంతకోపపడుటకు మనమేమి యగౌరవము చేసితిమి?