పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/539

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

528

భక్తిరసశతకసంపుటము


మ.

అనివార్యుం డగునట్టి కాలయవనుం డన్వాఁడు యుద్ధంబొన
ర్చిన వాని న్ముచికుందసంశ్రితధరిత్రీభృద్గుహాంతంబునన్
జనఁగాఁ జేసి మునీంద్రుచేత నతని న్జంపించి యమ్మౌనిచే
ననుకూలస్తుతు లొందినాఁడవుగదయ్యా శ్రీహరీ మాధవా.

43


మ.

నినుఁ బూజింపఁగ ధర్మనందనుఁడు యత్నింపన్ దదుద్దేశము
న్విని యంతఁ శిశుపాలుఁ డాగ్రహముచే నిన్ దూలగా నప్పు డా
తనిశీర్షంబును ద్రుంచినాఁడవు సభాస్థానంబున న్సభ్యులె
ల్లను మెచ్చంగ భవద్విదూషకులు నేలంగూలరే మాధవా.

44


శా.

కాళిందీహ్రదమందుఁ గాళియమహాకాళోదరుం డంబువుల్
క్ష్వేళజ్వాలల నిండఁజేసి జనుల న్వేధింప నీ వప్పు డా
వ్యాళోద్గర్వ మణంచి తచ్ఛిరములం దంఘ్రిద్వయం బుంచి స
ల్లీల న్నాట్య మొనర్చినాఁడవు ప్రజ ల్మెచ్చంగ నో మాధవా.

45


మ.

సమరాజేయపరాక్రముండగు జరాసంధుడు నీతోడ యు
ద్ధముఁ గావింపఁదలంచుచున్నతఱిఁ దద్బాహాసముద్రిక్తగ
ర్వము వారింపఁగ భీమునిన్ జొనిపి సంగ్రామంబున న్వాని నం
తము నొందించితి వబ్బురంబుగను క్షుద్రధ్వంసకా మాధవా.

46