పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/446

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ రాజశేఖరశతకము చంపకోత్పలమాలికలతో రచింపబడిన యుత్తమశతకము. ఇది రచించినకవి సత్యవోలు సోమసుందరకవి. ఈయన నియోగిబ్రాహ్మణుఁడు. వేంకటరాయమంత్రి పుత్రుఁడు. “శాంకరీవరపరిలబ్ధసారమృదు వాక్కలితాతతగీతసాహితీపరిచయుఁడన్” అను శతకపద్యభాగమువలన నీకవి సంస్కృతాంధ్రభాషలయందె గాక సంగీతవిద్యయందుఁ గూడ నిపుణుఁడని యెఱుంగనగును.

కొలఁదిగ నీతిపద్యములున్నను మొత్తముమీఁద నీరాజశేఖరశతకము భక్తిరసశతకములలో నొకటి. ఇందు తొలుతగలపద్యములు కొన్ని యంత్యనియమముతోడను గొన్ని ముక్తపదగ్రస్తముగ వ్రాయఁబడియున్నవి. కవిత నిరర్గళధారాశోభితమై మనోహరముగా నున్నది. కులశేఖరాళ్వారులు చెప్పిన ముకుందమాలయందలి యీ క్రిందిశ్లోక మీశతకమున 87-వ పద్యమునఁ గలదు.

శ్లో. కృష్ణ త్వదీయపదపంకజపంజరాంత
     మద్యైవ మే విశతు మానసరాజహంసః,
     ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః
     కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే.